14 కాలేజీల్లో కొత్త ఫీజులు.. మిగిలిన వాటిల్లో పాతవి

14 కాలేజీల్లో కొత్త ఫీజులు.. మిగిలిన వాటిల్లో పాతవి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ అంతా గందరగోళంగా తయారైంది. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను సర్కారు ఖరారు చేయకున్నా, జేఎన్టీయూ నుంచి ఇంకా గుర్తింపు పొందిన కాలేజీల లిస్టు విద్యాశాఖకు అందకున్నా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగలేదు. పాత ఫీజులు, పాత సీట్లతోనే మంగళవారం వెబ్ ఆప్షన్ల ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. అయితే 14 కాలేజీలు మాత్రం ఫీజుల పెంపు నిర్ణయంపై హైకోర్టుకు పోయి, వాటిల్లో తెలంగాణ అడ్మిషన్స్‌‌ అండ్‌‌ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్‌‌ఆర్సీ) ఖరారు చేసిన ఫీజులు వసూలు చేసుకునేందుకు పర్మిషన్ తెచ్చుకున్నాయి. ఈ నెల 21 నుంచి ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ మొదలైంది. మంగళవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌తో పాటు వెబ్ ఆప్షన్లు ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ జేఎన్టీయూ అధికారులు గుర్తింపు పొందిన కాలేజీల లిస్టు, కోర్సుల సీట్ల వివరాలను ఎంసెట్ అధికారులకు ఇవ్వలేదు. దీంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగిపోతుందని అంతా భావించారు. కానీ, మంగళవారం రాత్రి 179 కాలేజీల లిస్టును ఎంసెట్ వెబ్‌‌సైట్‌‌లో అధికారులు అప్‌‌లోడ్ చేశారు. రాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఈ లిస్టు గతేడాది గుర్తింపు పొందిన కాలేజీలు, వాటిలోని సీట్లనే అధికారులు పొందుపర్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జేఎన్టీయూ లిస్టు ఇవ్వకపోయినా, పాత లిస్టు ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

14 కాలేజీల్లో ఫీజు పెంపు..

రాష్ట్రంలోని 179 ఇంజినీరింగ్ కాలేజీల్లో 15 సర్కారు, 164 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటిలో 2019–2020 నుంచి 2021–22 బ్లాక్​ పీరియడ్‌‌కు గతంలో టీఏఎఫ్‌‌ఆర్సీ ఫీజులు ఖరారు చేసింది. ఈ బ్లాక్ పీరియడ్ ముగియడంతో 2022–23 నుంచి 2024–25కుగాను ఫీజులను ఖరారు చేసేందుకు టీఏఎఫ్‌‌ఆర్సీ మేనేజ్‌‌మెంట్లతో చర్చలు జరిపింది. కరోనా కారణంగా కాలేజీల్లో పెద్దగా ఖర్చులు కాలేదని, ఈ విద్యాసంవత్సరం పాత ఫీజులే కొనసాగించాలని టీఏఎఫ్‌‌ఆర్సీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని సర్కారుకు ప్రతిపాదించింది. కానీ, ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులివ్వలేదు. దీంతో 14 కాలేజీలు టీఏఎఫ్‌‌ఆర్సీ ఫీజులను ఫైనల్ చేసినా, సర్కారు మాత్రం ఖరారు చేయలేదని హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో టీఏఎఫ్‌‌ఆర్సీ ఫీజులను వసూలు చేసుకునేందుకు ఆయా కాలేజీలకు అవకాశమిచ్చింది. అయితే, ఎక్కువ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో పెట్టాలని, తుది తీర్పునకు లోబడి వాటిపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మంగళవారం నుంచి ప్రారంభమైన వెబ్ ఆప్షన్లలో 14 కాలేజీల్లో కొత్త ఫీజులు, మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. 

కన్వీనర్ కోటాలో 65,633 సీట్లు.. 

ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 45 బ్రాంచుల్లో 65,633 సీట్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా సీఎస్‌‌ఈలో 17,154 సీట్లు, ఈసీఈలో 11,375 సీట్లు, సీఎస్‌‌ఎంలో 7,032 సీట్లు, ట్రిపుల్‌‌ఈలో 5,337, ఐటీలో 4,692, సివిల్ ఇంజినీరింగ్‌‌లో 4,548, డేటా సైన్స్‌‌లో 3,549, సైబర్ సెక్యూరిటీలో 1,680 సీట్లు ఉన్నాయి. మంగళవారం నాటికి 51,488 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారని, 8,409 మంది వెరిఫికేషన్‌‌కు వచ్చారని అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు వచ్చే నెల 2 వరకు ఉంటుదని చెప్పారు.