
- కమిటీ ఏర్పాటు చేస్తామని సమ్మె విరమింపచేసిన ప్రభుత్వం
- రెగ్యులర్ కాకపోవడంతో నిరాశలో వేల మంది సెక్రటరీలు
హైదరాబాద్, వెలుగు : జూనియర్ పంచాయతీల సెక్రటరీల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ముందుకు పోవడం లేదు. జేపీఎస్ లను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి వారి సమ్మెను విరమింపచేసింది. అప్పటి నుంచి ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వేల మంది జేపీఎస్ లు నిరాశలో కూరుకుపోయారు. రెగ్యులర్ చేసే అంశంపై కనీసం కమిటీ అయినా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నాలుగేండ్ల ప్రొబేషన్ టర్మ్ పూర్తయినందున తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ర్టంలో పనిచేస్తున్న సుమారు 8500 మంది జేపీఎస్ లు ఏప్రిల్ 28 నుంచి మే 13 వరకు సమ్మె చేసిన విషయం తెలిసిందే.
16 రోజుల పాటు రాష్ట్రమంతా సమ్మె చేయడంతో గ్రామ పంచాయతీల్లో సేవలు నిలిచిపోయాయి. అన్ని జిల్లాలు, మండలాల్లో జేపీఎస్ లు ఆందోళన చేపట్టారు. అన్ని పార్టీల నేతలు వారి సమస్యకు మద్దతు పలికారు. వారిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేపీఎస్ లతో మంత్రి దయాకర్ రావు పలుమార్లు చర్చలు జరిపి సమ్మె విరమిస్తే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అయినా సెక్రటరీలు వెనక్కి తగ్గలేదు. దీంతో వారిని సస్పెండ్ చేసి, డిగ్రీ పూర్తిచేసిన వారిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీచేశారు. కొంత గడువు ఇచ్చి, జాయిన్ కాకపోతే సస్పెండ్ చేస్తామని జేపీఎస్ లను సర్కారు హెచ్చరించింది. దీంతో సెక్రటరీలు వెనక్కి తగ్గి మంత్రి దయాకర్ రావు కలిసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
సర్క్యులర్ ఇస్తే కోర్టుకు వెళ్తారని భయం
వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 28 నాటికి జేపీఎస్ ల నాలుగేండ్ల ప్రొబెషన్ గడువు అయిపోయింది. అయినా వాళ్లను ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదు. ప్రొబెషన్ టైమ్ మరి కొంతకాలం పెంచుతున్నట్లు ఎలాంటి సర్య్యులర్ కానీ, మెమో కానీ పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు. సర్య్కులర్ ఇస్తే సెక్రటరీలు కోర్టుకు వెళతారని, అందుకే ఇవ్వడం లేదని తెలుస్తున్నది. కాగా, జూన్ 2 నుంచి 22 వరకు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది.
ఈ ఉత్సవాల్లో అన్ని శాఖల్లో పలు స్కీమ్ లపై వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల నిర్వహణలో సర్పంచులు, సెక్రటరీలు కీలకమని భావించిన ప్రభుత్వం.. సర్పంచుల బిల్లులు క్లియర్ చేస్తామని, జేపీఎస్ లను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, 20 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో తమతో వెట్టిచాకిరి చేయించుకున్నారని, తమ రెగ్యులరైజేషన్ పై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదని జేపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.