సిటీలో వాన తెల్లారే దాకా కుమ్మరించింది

సిటీలో వాన తెల్లారే దాకా కుమ్మరించింది
  • సిటీలో రెండో రోజు జోరుగా వాన
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • గంటల పాటు నిలిచిన ట్రాఫిక్
  • రోడ్లపై మోకాలిలోతు నిలిచిన వరద
  • వాహనదారులకు తప్పని ఇబ్బందులు
  • మరో మూడు రోజులు మోస్తరు వానలు

హైదరాబాద్​, వెలుగు: సిటీలో రెండో రోజు బుధవారం సాయంత్రం నుంచి వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రాత్రి 11 గంటల వరకు శేరిలింగంపల్లిలో అధికంగా 10.2 సెం.మీ, షేక్​పేటలో తక్కువగా 2.2 సెం.మీ  వర్షపాతం నమోదైంది.  రోడ్లపై భారీగా ట్రాఫిక్​జామ్ అయింది. గంటలపాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  మధ్యాహ్నం 3 గంటలకు షురువైన వాన గురువారం తెల్లవారుజామున వరకు పడింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారికి కష్టాలు వచ్చాయి. మోకాలిలోతు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ఇబ్బందిగా మారింది. రాజ్​భవన్​ రోడ్డులో రెండో రోజు మళ్లీ అదే సీన్​ కనిపించింది. కొద్దిసేపటికి డీఆర్​ బృందాలు చేరుకొని వరదనీటిని క్లియర్ చేశాయి. టోలిచౌకిలో చిన్న వానకే ఫ్లై ఓవర్​ కింద నుంచి వాహనాలు వెళ్లేందుకు వీలుండదు. నడుంలోతు నీరు రోడ్డుపై చేరుతుండగా వేరే రూట్​లో వెళ్లాల్సి వస్తోంది. ఏండ్లుగా ప్రాబ్లమ్​ ఉంటున్నా బల్దియా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. బంజా రాహిల్స్​, జూబ్లీహిల్స్​ ప్రాంతాల్లో కూడా మ్యాన్​ హోల్స్​ జామ్​ అవడంతో రోడ్లపై మోకాలిలోతు నీరు నిలిచింది.​ మరో 3 రోజులు తేలికపాటి నుంచి  మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్​ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

మళ్లీ మునిగిన అయ్యప్ప కాలనీ
ఎల్ బీనగర్: వనస్థలిపురం, హయత్ నగర్ లోని లోతట్టు కాలనీలు  వాన నీటితో నిండిపోయాయి.   నాగోల్ డివిజన్ అయ్యప్ప కాలనీలో ఇండ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు అయ్యప్ప కాలనీ రెండు నెలల పాటు వరద నీటిలోనే ఉంది. బుధవారం సాయంత్రం నుంచి కురిసిన వానకు గతంలో మాదిరిగా ఇబ్బందులు వస్తాయోమోనని కాలనీ వాసులు రాత్రికిరాత్రే ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.