
- వెంటనే ఎత్తేయాలని సర్కారు ఆదేశాలు
- రెండు నెలల క్రితమే కేబినెట్ నిర్ణయం
- ఇంకా కొనసాగిస్తుండటంతో రవాణా శాఖపై సీరియస్
- సాయంత్రం 5లోపు ఎత్తేయాలని కమిషనర్ ఆదేశాలు
- 3 గంటల్లోనే ఖాళీ చేసి, ఆర్టీఏ ఆఫీసుల్లో రిపోర్ట్ చేసిన సిబ్బంది
- ఇకపై ఎన్‌ఫోర్స్‌మెంట్, కెమెరాలతో నిఘా.. ఆన్లైన్లోనే చెల్లింపులు
- మరింత పారదర్శకత కోసమే చెక్ పోస్టులు ఎత్తేశాం: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 15 బోర్డర్ చెక్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. బుధవారం (అక్టోబర్ 23) సాయంత్రం ఐదు గంటల నుంచి అన్ని చెక్ పోస్టుల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో పని చేస్తున్న ఆర్టీఏ ఉద్యోగులు పెట్టే, బేడా సర్దుకొని ఆయా జిల్లాల పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రిపోర్టు చేశారు.
ఇంతకాలం చెక్ పోస్టుల్లో ఉన్న ఆర్థిక, పరిపాలనాపరమైన రికార్డులను, ఫర్నిచర్ ను, ఇతర పరికరాలను.. అన్నింటినీ ఆయా జిల్లాల ఆఫీసులకు తరలించారు. ఇప్పటివరకు చెక్ పోస్టు విధుల్లో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐలు, ఇతర సిబ్బందిని ఆయా జిల్లాల పరిధిలోని రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించడంతోపాటు మరికొందరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోకి తీసుకోనున్నారు. చెక్ పోస్టుల వద్ద వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించారు. రాష్ట్రంలో ఇక నుంచి ఏ రహదారి వెంట అయినా సరే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, తనిఖీలు లేకుండా ప్రయాణించే అవకాశం ఈ చెక్ పోస్టుల ఎత్తివేతతో ఏర్పడింది. కాగా, ఈ చెక్ పోస్టులను ఆగమేఘాల మీద ఎత్తివేయడం రాష్ట్రవ్యాప్తంగా ఇటు పొలిటికల్ సర్కిల్ లో అటు ప్రభుత్వంలో పెద్ద చర్చకు దారితీసింది.
రెండు నెలల క్రితమే నిర్ణయం..
రవాణాశాఖ చెక్ పోస్టులను ఎత్తివేయాలని రెండు నెలల క్రితమే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ ఆర్టీఏ అధికారులు వీటిని ఇంకా కొనసాగించడంపై సీఎంఓకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కేవలం మామూళ్ల కోసమే వీటిని కొనసాగిస్తున్నారని, చెక్ పోస్టుల్లో తనిఖీల పేరుతో పెద్ద మొత్తంలో ఆర్టీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నాలుగు రోజుల కింద ఏసీబీ అధికారులు దాదాపు అన్ని చెక్ పోస్టులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్క తేలని నగదును లక్షల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో చెక్ పోస్టుల్లో అవినీతి మరోసారి బట్టబయలు కావడంతో సీఎంఓకు ఏసీబీ సమగ్ర నివేదిక అందించింది. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలంటూ బుధవారం ఉదయమే సీఎం కార్యాలయం నుంచి రవాణా శాఖ కమిషనర్ రఘునందన్ రావుకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో సాయంత్రం 5 గంటలలోపు అన్ని చెక్ పోస్టులను ఎత్తివేయాలంటూ మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్ని జిల్లాల డీటీసీలు, ఆర్టీఏలకు అత్యవసర ఆదేశాలు వెళ్లాయి. కేవలం రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే అన్ని చెక్ పోస్టుల్లో కార్యాకలాపాలు నిలిచిపోయాయి. సాయంత్రం 5 తర్వాత సీఎంఓకు దీనిపై సమగ్ర రిపోర్టు కూడా అందింది.
కేంద్రం ఆదేశాల మేరకే..
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చెక్ పోస్టుల అవసరం లేకుండా పోయింది. చెక్‌పోస్టుల కారణంగా నేషనల్, స్టేట్ హైవేలలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోందని, అన్ని రాష్ట్రాలు ఈ చెక్ పోస్టులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు చాలా రాష్ట్రాల్లో చెక్ పోస్టులను ఎత్తివేశారు. తెలంగాణలో మాత్రం ఇవి కొనసాగుతూ వచ్చాయి. అయితే, కేబినెట్నిర్ణయం తీసుకున్నప్పటికీ రవాణా శాఖలో చెక్‌పోస్టుల ద్వారా వచ్చే అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ కొందరు అధికారులు వీటిని ఎత్తివేయలేదనే ఆరోపణలు వినిపించాయి.
ఈ క్రమంలో ఏసీబీ దాడులతో ఈ అవినీతి మరోసారి బట్టబయలైంది. చివరకు సీఎం రేవంత్ సీరియస్ అయితే తప్ప వీటిని ఎత్తివేయలేదు. కాగా, చెక్ పోస్టుల ఎత్తివేతతో ఇకనుంచి ఇతర రాష్ట్రాల వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు అవసరమైన ట్యాక్స్ చెల్లింపులన్నింటినీ ఆన్ లైన్ లోనే చేయాల్సి ఉంటుంది. చెక్ పోస్టుల స్థానంలో అడ్వాన్సుడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్ ఖైరతాబాద్ లోని కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేసి ఏఐ సహాయంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు.
బ్రోకర్ వ్యవస్థను నిర్మూలిస్తాం: పొన్నం
రవాణా శాఖలో మరింత పారదర్శకత కోసమే చెక్ పోస్టులను ఎత్తివేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. చెక్‌పోస్టుల ఎత్తివేత అంశాన్ని మొదట తానే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ఆ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ చెక్ పోస్టుల ద్వారా పదేళ్లుగా భారీ అవినీతి జరిగిందని, ఇన్నాళ్లకు పాపాలపుట్ట పగిలిందన్నారు.
ఇకపై రవాణా శాఖలో బ్రోకర్ వ్యవస్థను నిర్మూలిస్తామని పేర్కొన్నారు. ఎన్నో సంస్కరణలు, మార్పులు, పారదర్శకమైన పాలనను అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు. రాష్ట్రంలో ‘‘వాహన్’’ పాలసీని తెచ్చామని, త్వరలోనే ‘‘సారథి” పాలసీని తెస్తామని అన్నారు. స్క్రాపింగ్ పాలసీతో పాత వాహనాల కాలుష్యం తగ్గిస్తున్నామని, రోడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలిపారు.