వెయ్యేండ్ల ఆధ్యాత్మిక ప్రేరణకు మూలం సోమనాథ్ పునఃనిర్మాణం.. టెంపుల్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ

వెయ్యేండ్ల ఆధ్యాత్మిక ప్రేరణకు మూలం సోమనాథ్  పునఃనిర్మాణం.. టెంపుల్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎయిర్ షో వీక్షణ
  •     స్పెషల్​ పోస్టల్ స్టాంప్, రూ. 75 నాణెం విడుదల
  •     ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని వ్యాఖ్య

సోమనాథ్​(గుజరాత్), వెలుగు:
సోమనాథ్ ఆలయ పునః నిర్మాణం వెయ్యేండ్ల ఆధ్యాత్మిక ప్రేరణకు మూలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్​ను లొంగదీసుకోలేదని చెప్పారు. సోమనాథ్ ఆలయం పునః నిర్మాణం చేపట్టి సోమవారానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవం’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా సాగర తీరంలో వెలసిన సోమనాథ్ మందిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు ప్రధానికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవ లింగానికి ప్రధాని అభిషేకం, దీపారాధన చేశారు. 

ఈ మహోత్సవంలో భాగంగా గుడి గోపురంపై నీటితో నింపిన భారీ కలశాన్ని రిమోట్​తో మోదీ ప్రారంభించారు. అనంతరం నందీశ్వరుడు, త్రిశూలంతో కూడిన భారీ జెండాను గోపురంపై ఎగురవేశారు. మోదీ పూజలు చేస్తున్న సమయంలో ఒక హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఆలయంపై పూలు చల్లింది. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ అక్రోబాటిక్స్ బృందం వైమానిక విన్యాసాలు ప్రదర్శించింది. అంతకుముందు, సోమనాథ్‌‌‌‌లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. 

రోడ్డుకు ఇరువైపులా గుమిగూడిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆలయం ఎదురుగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ రోడ్ షోలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ మహోత్సవం సందర్భంగా.. తపాలా శాఖ జారీ చేసిన తపాలా బిళ్లను, రూ.75 విలువ గల ప్రత్యేక నాణేన్ని ప్రధాని విడుదల చేశారు.

  • సంకుచిత రాజకీయాలను విడిచిపెట్టాలి..

అనంతరం ప్రభాస్ పటాన్​లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఒక దేశపు గుర్తింపుతో ముడిపడి ఉన్న ప్రదేశాలను విదేశీ దురాక్రమణదారులు నాశనం చేసిన లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా, ఆ దేశాల ప్రజలు తమ గుర్తింపును తిరిగి పొందడానికి, తమ జాతీయ గర్వాన్ని పునరుద్ధరించుకోవడానికి ఏకమయ్యాని గుర్తుచేశారు. ‘దేశ స్వాతంత్ర్యం తరువాత చేపట్టిన మొదటి పనులలో సోమనాథ దేవాలయం పునర్నిర్మాణం ఒకటి. సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ ఎంతో కృషి చేశారు. 

నెహ్రూ నుంచి వారు ఎదుర్కొన్న వ్యతిరేకత తీవ్రత మనందరికీ తెలుసు. అయినా వల్లభాయ్ పటేల్ దృఢంగా నిలబడడంతో దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. శతాబ్దాలుగా అలుముకున్న ఒక మచ్చను దేశం తుడిచివేసింది’ అని అన్నారు. అయితే, జాతీయ ఆత్మగౌరవం కంటే శాంతికి ప్రాధాన్యతనిచ్చే శక్తులు మన దేశంలో ఇప్పటికీ పనిచేస్తున్నాయని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. సంకుచిత రాజకీయాలను విడిచిపెట్టి అభివృద్ధిని, వారసత్వాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

  • మే 11 చాల ముఖ్యమైంది..

మే 11వ తేదీ దేశ చరిత్రలో చాలా ముఖ్యమైందని మోదీ అన్నారు. ‘1951 మే 11 సోమనాథ్ ఆలయ పునఃనిర్మాణానికి అంకురార్పన జరిగింది. మే 11, 1988 లో ఆనాటి ప్రధాని వాజ్‌‌‌‌పేయి పోఖ్రాన్‌‌‌‌లో అణుబాంబు పరీక్ష నిర్వహించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దేశంపై అనేక ఆంక్షలు విధించారు. కానీ, మే 13న మరో రెండు అణు పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశ రాజకీయ సంకల్పం ఎంత అచంచలమైనదో ఇది ప్రపంచానికి నిరూపితమైంది. ఆ సమయంలో యావత్ ప్రపంచ ఒత్తిడి భారతదేశంపై ఉంది. అయినప్పటికీ, వాజ్‌‌‌‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాకు దేశమే ప్రథమం అని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏ శక్తి కూడా 
భారతదేశాన్ని మోకరిల్లజేయలేదు. ఏ శక్తి కూడా ఒత్తిడికి లొంగేలా చేయలేదు’ అని పేర్కొన్నారు. 

  • శివశక్తి స్వరూపం..

శివశక్తి ఆరాధన దేశ శాస్త్రీయ ప్రగతికి కూడా స్ఫూర్తిగా నిలవాలని ప్రధాని కాంక్షించారు. ప్రొఖ్రాన్ లో అణు పరీక్ష కు ‘ఆపరేషన్ శక్తి’ శక్తిగా నామకరణం చేశారన్నారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా సోమనాథ స్వామి పాదాల చెంత నుంచి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ప్రసంగంచారు. ‘దేశం పోఖ్రాన్ అణు పరీక్షకు ‘ఆపరేషన్ శక్తి’ అని పేరు పెట్టింది. ఎందుకంటే శివునితో పాటు శక్తిని పూజించడం మన సంప్రదాయం. అర్ధనారీశ్వరుడైన శివుడు కూడా శక్తితోనే పరిపూర్ణుడు.  అంతేకాదు, ఈ జ్యోతిర్లింగానికి చంద్రుని పేరు మీదుగా సోమనాథ్ అని పేరు పెట్టడం ఎంత అద్భుతం’ అని అన్నారు.