- పెస్టిసైడ్స్ అధిక వాడకంతో మన బియ్యాన్ని యూరప్, అమెరికా కొంటలేవు
- సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే కొనుగోళ్లు లేటవుతున్నాయని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: రైతులపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని తెలిపారు. అన్ని వనరులు ఉన్నా.. ప్రభుత్వ చేతగానితనం, పంట కొనుగోళ్లలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని అన్నారు.
కొనుగోళ్లు చేయ చేతగాక.. ఆ నిందను కేంద్రంపైకి నెడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రమే మొత్తం కొనాలనే నిబంధన ఎక్కడా లేదని పేర్కొన్నారు. పీడీఎస్ అవసరాల కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ‘రైతుల గోస – బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ మంత్రులు ఆఫీసులకే పరిమితమయ్యారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా ప్రకటనలకే పరిమితమైందన్నారు. ‘‘కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ, కొనుగోళ్లు, రైస్ మిల్లులకు తరలింపు వంటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపాలి.
మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అందించాలి. ప్రతి పంట సీజన్‌కు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమై ఉత్పత్తి అంచనాలు, కొనుగోలు పరిమాణం, నిల్వ సదుపాయాలు, వ్యయభారం తదితర అంశాలపై చర్చించి లక్ష్యాలను నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సమావేశాల్లో ఈ లక్ష్యాలకు అంగీకరించింది.
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 52.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేపట్టలేకపోయిందో సమాధానం చెప్పాలి. తమ బాధ్యతలను నిర్వర్తించకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం సరికాదు’’ అని అన్నారు.
- దొడ్డు వడ్ల రైతులపై నిర్లక్ష్యం
ప్రభుత్వం సన్న వడ్ల సేకరణపైనే దృష్టి పెడుతూ.. దొడ్డు వడ్లు పండిస్తున్న రైతులను నిర్లక్ష్యం చేస్తున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్ దొడ్డుబియ్యాన్ని కొనుగోలు చేసేవని, కానీ, ఇప్పుడు అక్కడ కూడా ఉత్పత్తి పెరగడంతో పరిస్థితులు మారాయని చెప్పారు.
దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాల్సిందని హితవు పలికారు. యూరప్, అమెరికా వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే పెస్టిసైడ్స్ వినియోగం తక్కువగా ఉండాలని.. రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
తెలంగాణలో కొనుగోలు చేసిన నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి, అక్కడి నుంచి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అఖిలపక్ష సమావేశాలు, రైతు సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
