
రూల్‌ను సవరించిన ఐసీసీ
దుబాయ్: మెగా టోర్నీల్లో ఫలితాన్ని తేల్చే ‘సూపర్ ఓవర్’ రూల్‌ను ఐసీసీ స్వల్పంగా మార్చింది. ఇంతకుముందు సూపర్ ఓవర్‌లో స్కోర్లు టై అయితే.. ఎక్కువ బౌండరీలు కొట్టిన టీమ్‌ను విజేతగా ప్రకటించే వారు. కానీ ఈ పద్ధతికి చెక్ పెడుతూ.. విజేత ఎవరనేది స్పష్టంగా తేలే వరకు సూపర్ ఓవర్లను కొనసాగించాలని ఇంటర్నేషనల్ బాడీ కొత్తగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రికెట్ కమిటీ చేసిన ప్రతిపాదనకు ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం ఆమోద ముద్ర వేసింది.
2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో.. ఐసీసీ ఈ రూల్‌ను సవరించింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీ (వన్డే, టీ20 వరల్డ్‌కప్)లో సెమీస్, ఫైనల్స్‌కు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ గ్రూప్ దశలో జరిగే మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్‌లో స్కోర్లు సమమైతే మాత్రం ఆ ఫలితాన్ని ‘టై’గానే పరిగణిస్తారు.