వర్సిటీ ఎగ్జామ్స్​పై తెలంగాణ సర్కారు ఫోకస్​

వర్సిటీ ఎగ్జామ్స్​పై తెలంగాణ సర్కారు ఫోకస్​
  • వర్సిటీ ఎగ్జామ్స్​పై సర్కారు ఫోకస్​ 
  • ఎగ్జామినేషన్ బ్రాంచ్​లలోని ఎంప్లాయీస్ డేటా సేకరణ 
  • త్వరలో సీఎం రేవంత్ ​రివ్యూ చేసే అవకాశం 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ నిర్వహణపైనా ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. కొన్ని వర్సిటీల్లో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, అన్ని వర్సిటీల తీరుపైనా సమీక్షించేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీతో సహా మిగిలిన యూనివర్సిటీల్లోని ఎగ్జామినేషన్ బ్రాంచ్​లలో పనిచేసే ఎంప్లాయీస్ వివరాలను సేకరిస్తోంది. దీంట్లో  రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది? కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్  ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? అనే సమాచారం తీసుకుంటున్నది. 

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ఈ డేటాను వర్సిటీల నుంచి సేకరించి, సర్కారు పెద్దలకు అందించారు. అయితే, పలు వర్సిటీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎగ్జామినేషన్ బ్రాంచ్​లలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్సిటీల్లో పరీక్షల విభాగాన్ని పటిష్ట పరిచేందుకు సర్కారు సమాయత్తం అవుతోంది. దీంట్లో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్సిటీల వీసీలు, ఎగ్జామినేషన్ బ్రాంచ్​అధికారులతో సమావేశం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం సమీక్షించారు. గతంలో మాదిరిగా లీకేజీల బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సర్కారు రెడీగా ఉందని సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.