గుట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

గుట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు రెవెన్యూ అధికారులు. బీఆర్ఎస్ నాయకులు తమ అనుచరులకే ఇండ్లు పంపిణీ చేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

ఎవరికీ తెలియకుండా ఇండ్లను పంపిణీ చేశారని స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోకల్ గా ఉండే ప్రతిపక్ష నాయకులు కూడా అధికారులు, బీఆర్ఎస్ నాయకుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. లక్ష రూపాయల వ్యవధితో చేపట్టే పనులకు కూడా శిలాఫలకాలు ఏర్పాటు చేసి, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసే నాయకులు.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి, నిర్మించిన ఇండ్లను గుట్టుగా పంపిణీ చేయాల్సి అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా రెవెన్యూ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.