వరి కోతకొచ్చింది.. కొనేటోళ్లేరి?

వరి కోతకొచ్చింది.. కొనేటోళ్లేరి?

పొలంలోనే రాలుతున్న వడ్లు

6,491 కొనుగోలు సెంటర్లకు  3,485 మాత్రమే తెరిచిన్రు

చాలా చోట్ల సెంటర్లు లేక  రైతుల ఆందోళన

సెంటర్ల ఓపెనింగ్​లోనూ రాజకీయాలే.. లీడర్లు వచ్చేదాకా ఓపెన్‌ చేస్తలేరు

6,491 కొనుగోలు సెంటర్లకు 3,485 తెరిచిన్రు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో వరి పంటలు కోతకు వచ్చి 25 రోజులవుతున్నా.. పూర్తి స్థాయిలో కొనుగోలు సెంటర్లను ఓపెన్​ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట కోస్తే వడ్లను కాపాడుకోవడం ఎట్లని పరేషాన్​ అవుతున్నారు. కోతకు వచ్చినా.. కోయపోవడంతో వడ్లు పొలంలోనే రాలుతున్నాయి. కొందరు రైతులు ధైర్యం చేసి పంట కోసినా.. సెంటర్లు లేక రోడ్ల మీదనే వడ్లను ఆరబోసి ఎదురు చూస్తున్నారు. రాత్రంతా వడ్ల కుప్పల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇంకొందరు అగ్గువకో సగ్గువకో దళారులకు అమ్మేసుకుంటున్నారు. మరోవైపు సన్న వడ్లకు రేటు ఎంత అన్నది ఇప్పటికి కూడా తేలలేదు. వానాకాలం సీజన్​లో వడ్లను కొనేందుకు రాష్ట్రంలోని 6,491 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో ఇప్పటి వరకు సగం సెంటర్లనే తెరిచింది. కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌ మినహా ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో సెంటర్లు ఓపెన్​ కాలేదు.

కొనుగోళ్లలో రాజకీయం

వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన సెంటర్లు తెరవాలంటే స్థానిక ఎమ్మెల్యేనో.. మంత్రో.. ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. నేతలు కొబ్బరికాయ కొట్టి ఫొటోలకు పోజులిస్తే కానీ సెంటర్లు ప్రారంభం కావడం లేదు. టైం లేదని కొన్ని చోట్ల లీడర్లు రావడం లేదు. తీరిక  ఉన్నప్పుడు వచ్చి స్టార్ట్​ చేస్తమని చెప్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఇంకా తెరువలేదు. లీడర్లు వచ్చేదెప్పుడో సెంటర్లు చాల్‌‌ అయ్యేదెప్పుడోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

6,491 సెంటర్లకు తెరిచింది 3,485

కొనుగోలు సెంటర్ల ద్వారా 75 లక్షల టన్నుల వడ్లను కొనేందుకు సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సిద్ధమైంది. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 6,491 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ, పంట కోతలు ప్రారంభమై దాదాపు 25 రోజుల దాటినా ఇప్పటి వరకు కేవలం 3,485 సెంటర్లలోనే వడ్లు కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో 421 సెంటర్లు ప్రపోజల్‌‌ ఉండగా అసలు సెంటర్లే  ఓపెన్‌‌ చేయలేదు. వరంగల్‌‌ అర్బన్‌‌ జిల్లాలో 101 గానూ ఒక్కటే ఓపెన్‌‌ అయింది. మహబూబాబాద్‌‌ జిల్లాలో173 సెంటర్లకు గానూ 8 మాత్రమే స్టార్టయ్యాయి.  మహబూబ్‌‌నగర్​ జిల్లాలో  225 సెంటర్లకు గానూ 38 సెంటర్లనే ఓపెన్​ చేశారు.  నాగర్‌‌ కర్నూల్​ జిల్లాలో 201 సెంటర్లలో 9 మాత్రమే తెరిచారు. సూర్యాపేట జిల్లాలో 308 సెంటర్లకు గానూ 79 తెరిచారు. మొత్తంగా ఇప్పటివరకు 6.63 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. అందులో ఇప్పటికే 1.31 లక్షల టన్నులు సన్న వడ్లు.  మిగతా 5.32 లక్షల టన్నులు సాధారణ రకం వడ్లు.

సెంటర్లకు స్థలాల కొరత

కొన్ని జిల్లాల్లో స్థలాల కొరతతో సెంటర్లు తెరవడం ఆలస్యమవుతున్నదని ఆఫీసర్లు అంటున్నారు. పలు జిల్లాల్లో ఇంకా సెంటర్ల కోసం సొసైటీలు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు వెతుకులాడుతున్నారు. మహబూబాబాద్‌‌ జిల్లా నెల్లికుదురు, రావిర్యాల, వావిలాల, మొదనతుర్తి, ఆలేడు తదితర ప్రాంతాల్లో వరి పొలాలు కోతలకు వచ్చినా ఇంకా సెంటర్ల కోసం స్థల పరిశీలన జరుగుతున్నది. రెండు మూడు ఊర్లకు ఒక సెంటర్‌‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సెంటర్లు తెరువకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. సన్నధాన్యంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో పొలాలు కోసి కల్లాల వద్దే క్వింటాల్‌‌కు రూ. 1,400 నుంచి రూ.1600 ఇచ్చేస్తున్నారు.

రూ. 50 వేలు నష్టపోయిన

15 ఎకరాల్లో వరి సన్నరకం సాగు చేసినం. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినం. ముందుగా నాట్లు వేయడం వల్ల పొలాలు కోసినం. పంట చేతికి వచ్చాక కొనుగోలు సెంటర్లు తెరువలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, బోనస్‌‌ ప్రకటించలేదు. కొన్ని రోజులు ఆగుదామంటే పొలం అడ్డం పడుతున్నది. చేసేది ఏం లేక ఇప్పటి వరకు 8 ఎకరాల పొలం కోపిచ్చినం. దాదాపు 130 క్వింటాళ్లు రూ. 1400 చొప్పున అమ్ముకున్నం. నిరుడు రూ. 1,850కి అమ్మినం. ఇప్పడు రూ. 50 వేలు నష్టపోయినం. ఇప్పటికైనా సర్కారు సెంటర్లు ఓపెన్​ చేసి మద్దతు ధరతో వడ్లుకొనాలి.– కవిత, మహిళా రైతు, ఖమ్మం జిల్లా

పొలం కొయ్యాల్నా.. ఆగాల్నా..

ఎనిమిది ఎకరాల్లో సన్న వడ్లు వేసినం. కోతకు తయారైంది. కొయ్యడానికి ముందుకు పోదాం అంటే ప్రభుత్వం ధర ప్రకటించలేదు. ఆగుదామంటే వర్షం భయంతోపాటు కోస్తే  అగ్గువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. వడ్లు నిల్వచేసుకుందామంటే జాగ లేదు. టార్పాలిన్లు లేవు. కిరాయి తేవాల్నంటే ఖర్సయితది. వడ్లు కాపాడుకోవడం కష్టంగా ఉంది. సన్న రకానికి ధర ప్రకటిచాలని కోరుతున్నం.–నర్సిరెడ్డి, రైతు, చౌటపల్లి, ఖమ్మం జిల్లా