నెలకు వెయ్యి రూపాయల లక్కీ డ్రా స్కీం : 2 వేల మందిని 2 కోట్లకు ముంచాడు

నెలకు వెయ్యి రూపాయల లక్కీ డ్రా స్కీం : 2 వేల మందిని 2 కోట్లకు ముంచాడు

లక్కీ డ్రా అంటే మిడిల్ క్లాస్ జనాలకు ఎక్కడ లేని ఆశ పుట్టుకొస్తుంది. డ్రాలో ఫ్రీగా కార్లు, ఏసీలు గెలుపొందచ్చన్న ఆశతో రకరకాల స్కీంలలో చేరి మోసపోతుంటారు చాలామంది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నా కూడా జనాల్లో ఈజీ మనీ పట్ల ఆశ మాత్రం తగ్గడం లేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇలాంటి మోసం వెలుగులోకి వచ్చింది. 15 నెలల పాటు రూ. వెయ్యి కడితే.. విలువైన వస్తువులు ఇస్తామని చెప్పి..సుమారు రూ. రెండు కోట్లు కలెక్ట్ చేసి ఉడాయించారు చీటర్స్. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ALSO READ | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు.. పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్..

మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ లో లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్లు కొమ్ము రమేష్, కొమ్ము కోటేశ్వర రావు, బచ్చలకూరి శ్రీనులను అరెస్ట్ చేశారు పోలీసులు. RK ఎంటర్ ప్రైజస్ పేరుతో ఒక మల్టీ లెవెల్ సంస్థ ఏర్పాటు చేసిన కేటుగాళ్లు.. మిర్యాలగూడలో అమాయక ప్రజల నుంచి భారీగా సొమ్ము దండుకున్నారు. ప్రతి నెల రూ. వెయ్యి చొప్పున 15 నెలలు కడితే.. ప్రతి నెల డ్రా తీసి.. డ్రాలో గెలుపొందిన 10 మందికి విలువైన వస్తువులు ఇస్తామని చెప్పి భారీ మోసానికి పాల్పడ్డారు.

15 నెలలలో డ్రాలో రాకున్నా చివరకు కట్టిన మొత్తానికి అంత విలువ చేసే వస్తువులు తిరిగి ఇస్తామని నమ్మించిన కేటుగాళ్లు.. మొత్తం 2143 మందిని లక్కీ డ్రాలో చేర్పించి వారి నుంచి సుమారు రూ. కోటి 85 లక్షల 79 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
  
లక్కీ డ్రాలో విలువైన వస్తువులు ఇస్తామంటే ఆశపడి డబ్బులు కట్టొద్దని... ముల్టీ లెవల్, లక్కీ డ్రా పేరిట ఏర్పాటయ్యే సంస్థల్లో చేరి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.