హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613 భూముల వివాదంపై ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టత ఇచ్చింది. సదరు భూమిని ప్రైవేటు పట్టా భూమిగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పటికే ధృవీకరించిందని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజక్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రాజా శివరాజ్ బహదూర్ వారసుల నుంచి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ పొందామని, నిబంధనలకు విరుద్ధంగా భూసంస్కరణల చట్టాన్ని ఇక్కడ ప్రస్తావించడం సరికాదని సంస్థ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకుండా కొందరు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని, చట్టపరమైన హక్కులు తమకే ఉన్నాయని వివరించింది. సదరు భూమిపై ప్రభుత్వం, ఏపీఐఐసీ (ప్రస్తుత టీజీఐఐసీ) గతంలో దాఖలు చేసిన అప్పీళ్లను (సీఎ నం. 2963, 2964/2013) సుప్రీంకోర్టు కొట్టివేసిందని సంస్థ గుర్తుచేసింది.
2015లో వచ్చిన తుది తీర్పులో ఈ భూమిపై రాజా శివరాజ్ బహదూర్ వారసులకే పూర్తి హక్కులు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకూడదని కోర్టు స్పష్టం చేసిందని తెలిపింది. ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను సైతం 2016 ఏప్రిల్ 21న న్యాయస్థానం తిరస్కరించిందని, ఆ తర్వాత 2021లో హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి ‘పోట్ ఖరాబ్’ (వ్యవసాయానికి పనికిరానిది) అని, ఇది అర్బన్ అగ్లోమరేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి భూసంస్కరణల చట్టం వర్తించదని సంస్థ వివరించింది. ప్రస్తుతం ఈ అంశంపై కొందరు చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం సమంజసం కాదని ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ పేర్కొంది. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నప్పుడు బయట చర్చలు జరపడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.
కరీమ్ అల్లాదీన్ ద్వారా తాము ఈ భూమి అభివృద్ధికి సంబంధించి ఒమేగా డెవలప్‌మెంట్ వెంచర్స్, ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించింది. చట్టపరంగా అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భూమి యాజమాన్య హక్కులు ప్రైవేటు వ్యక్తులవేనని స్పష్టం చేస్తూ.. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సంస్థ కోరింది.
