పారిస్ మేయర్ ఇంటికి నిప్పు..భార్య, పిల్లాడికి గాయాలు.. ఫ్రాన్స్​లో ఆగని అల్లర్లు

పారిస్ మేయర్ ఇంటికి నిప్పు..భార్య, పిల్లాడికి గాయాలు.. ఫ్రాన్స్​లో ఆగని అల్లర్లు
  •     ఫ్రెంచ్ గయానాలో బుల్లెట్ తగిలి వృద్ధుడు మృతి
  •     ఇప్పటి వరకు పోలీసుల అదుపులో 3 వేల మంది
  •     అధ్యక్షుడు మాక్రాన్ జర్మనీ పర్యటన వాయిదా

పారిస్ : నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్​లో మంగళవారం రాత్రి మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో రోజైన ఆదివారం ఫ్రాన్స్ రణరంగంగా మారింది. పారిస్‌, మార్సెయిల్‌, లియాన్‌ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేలాది మంది యువకులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున పారిస్ మేయర్‌ విన్సెంట్‌ జీన్‌బ్రన్‌ ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. కారుకు నిప్పు పెట్టి ఇంటిని ఢీకొట్టించారు. ఈ ఘటనలో మేయర్ భార్య, ఒక పిల్లాడికి గాయాలయ్యాయి. 

దీనిపై విన్సెంట్ స్పందిస్తూ.. ‘‘శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర టైంలో కొందరు యువకులు నా ఇంటిపై దాడి చేశారు. అప్పుడు ఇంట్లో నా భార్య, పిల్లలు పడుకుని ఉన్నారు. నేను టౌన్ హాల్​లో వయలెన్స్​పై మానిటరింగ్ చేస్తున్నాను. దాడిలో నా భార్య, పిల్లాడికి గాయాలయ్యాయి. ఇంటికి నిప్పుపెట్టారు. మా వాళ్లను చంపేందుకు ప్రయత్నించారు. ఈ దాడి అవమానకరమైంది. ఎమర్జెన్సీ విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను”అని అన్నారు. 

అరెస్ట్ అయిన వారిలో యువకులే ఎక్కువ

45 వేల మంది పోలీసులు, స్పెషల్ ఎలైట్ యూనిట్లు, ఆర్మ్​డ్ వెహికల్స్, హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా పెట్టినప్పటికీ పారిస్‌, మార్సెయిల్‌, లియాన్​లో అల్లర్లు ఆగడం లేదు. 10 షాపింగ్​మాల్స్, 200కి పైగా సూపర్​మార్కెట్లు, 250 టొబాకో షాప్స్, 250 బ్యాంక్ ఔట్​లెట్లపై నిరసనకారులు దాడికి దిగి లూటీ చేశారు. గ్రిగ్నిలో కొన్ని ఇండ్లకు నిప్పుపెట్టారు. శనివారం రాత్రి సుమారు 800 మంది అరెస్ట్ చేశారు. 1,500కి యువకులు పోలీసులు కస్టడీలో ఉన్నారు. పారిస్​లో అర్ధరాత్రి పోలీసులపై నిరసనకారులు ఫైర్ క్రాకర్స్​తో దాడి చేశారు. 

బారికేడ్లకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రేనైడ్స్​ ప్రయోగించారు. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేలకు పైగా నిరసనకారులను అరెస్ట్ చేశామని, వీరిలో ఎక్కువ మంది యువకులేనని మంత్రి గెరాల్డ్ డార్మానిన్ ప్రకటించారు. 

చైనా టూరిస్ట్ బస్సుపై దాడి.. పలువురికి గాయాలు

అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు మాక్రాన్ తన జర్మనీ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు జర్మనీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అల్లర్లు వ్యాపించడానికి సోషల్ మీడియా కంపెనీలు ప్రధాన కారణమని మాక్రాన్ మండిపడుతున్నారు. నిరసనకారుల దాడుల్లో సుమారు 400 మంది పోలీసులు, ఫైర్ ఫైటర్స్ గాయపడ్డారు. ఓవర్సీస్ ఫ్రెంచ్ గయానాలో బుల్లెట్ తగిలి ఓ వృద్ధుడు చనిపోయాడు.

 సోషల్ మీడియాలో వయలెన్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని జస్టిస్ మినిస్టర్ ఎరిక్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న తమ పౌరులకు రక్షణ కల్పించాలని చైనా కాన్సులర్‌ వ్యవహారాల ఆఫీస్ ఫ్రాన్స్‌ను కోరింది.