అప్పుడే ఎండలు : రాష్ట్రంలో పెరిగిపోతున్న వేడి

అప్పుడే ఎండలు : రాష్ట్రంలో పెరిగిపోతున్న వేడి

35 డిగ్రీలు దాటిన టెంపరేచర్స్​
మామూలు కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువ
వాతావరణంలో మార్పుల వల్లే

హైదరాబాద్, వెలుగు: సూర్యుడి చురుకు మొదలైంది. ఎండ మంట పెరుగుతోంది. మామూలు కన్నా టెంపరేచర్లు ఎక్కువగా రికార్డవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. కారణం, వాతావరణంలో మార్పులు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. దానికి తోడు తేమ గాలులు రావడం వల్ల మేఘాలు ఏర్పడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడి మంట మొదలవుతోంది. మధ్యాహ్నం కాగానే ఎక్కువవుతోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనాలు ఆలోచిస్తున్నారు. టెంపరేచర్లు మామూలు కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. 35 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. ఎండ వేడితో పగలు, రాత్రి వేళల్లో ఉక్కపోత ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎండ వేడి నుంచి కాపాడుకునేందుకు జనం అప్పుడే కూల్​డ్రింకులవైపు చూస్తున్నారు. ఇప్పుడే ఇట్లుంటే ఎండాకాలంలో ఇంకెంత ఇబ్బంది పడాలోనని జనాలు ఆందోళన చెందుతున్నారు. మరో 15 రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అనేక చోట్ల సోమవారం పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ములుగులో ఎక్కువగా 35.8 డిగ్రీలు రికార్డయింది. సూర్యాపేటలో 35.6, సంగారెడ్డిలో 35.5, భద్రాద్రి కొత్తగూడెం 35.4, ఖమ్మం, నాగర్​కర్నూల్​లో 35.2 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మంగళవారం ఖమ్మంలో ఎక్కువగా 33.2 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. భద్రాచలంలో 33, నిజామాబాద్​, రామగుండంలలో 32.4, మెదక్​లో 32.3 హైదరాబాద్​లో 32.2 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు నాగర్​కర్నూల్​లో తక్కువగా 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్​ అర్బన్​లో రాత్రి టెంపరేచర్​ 20.6 డిగ్రీలు రికార్డయింది. చలికాలం పోయినట్టేనని, టెంపరేచర్లు 35 డిగ్రీలు దాటిపోయాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందన్నారు.