ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వాన బీభత్సం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వాన బీభత్సం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో స్మశాన వాటిక నీట మునిగింది. దుశ్శేడు, చేగుర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు
కరీంనగర్ జిల్లాలోని ఆమకొండలో 22.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుండీలో 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.  జగిత్యాలలోని కోరుట్లలో 16.3 సెంటీమీటర్లు, పెద్దపల్లి ఎలిగాడులో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నిజామాబాద్ లోని భీంగల్ లో 18.8 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లాలోని పెంబిలో 16.5, ఆలూరులోని 16.6 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ లోని నేరేడుగొండలో 14.1సెంటీ మీటర్ల  వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ధర్మ సముద్రం చెరువుకు  గండి..
మరోవైపు జగిత్యాలలోని ధర్మ సముద్రం చెరువుకు నిన్న గండి పడింది. దీంతో  స్థానికులు ఇసుక బస్తాలు వేసి గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నీట మునికి లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి సందర్శించారు. సహాయక చర్యలు చేపట్టారు. అలాగే మల్లాపూర్ మండలం మొగిలిపేట పెద్ద చెరువు కట్ట తెగిపోయింది.  దీంతో ఖానాపూర్, మెట్పల్లి రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది, 

పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలు..
కోరుట్ల,  మెట్ పల్లి మండలాల్లో  వాగులు, వంకలు  పొంగిపొర్లుతున్నాయి. కోరుట్ల, మెట్ పల్లి లోని  లోతట్టు ప్రాంత ప్రజలను  పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇబ్రహీంపట్నం  ఎర్ధండి గ్రామంలో  గోదావరి నది  ఉద్ధృతంగా  ప్రవహిస్తుంది. నది పరీవాహక  ప్రాంతాలు పునరావాస  కేంద్రాలకు, ఇతర  ప్రాంతాలకు తరలివెళ్లారు. మల్లాపూర్ మండలంలోని  వాల్గొండ,  ఒగులాపూర్,  కొత్త ధాంరాజ్ పల్లి  గ్రామాల దగ్గర ...నది ప్రవాహం ఎక్కువగా  ఉంది. కొత్త  ధాంరాజ్ పల్లి గ్రామస్థులను  పురావాస కేంద్రాలకు  తరలించారు అధికారులు. 

మంథని  పట్టణంలో ఇళ్లలోకి  వరద నీరు..
అటు  మంథని మండలంలోని  సూరయ్యపల్లి,  ఖానాపూర్, ఎక్లాస్ పుర్, మంథని  పట్టణంలో ఇళ్లలోకి  వరద నీరు  చేరింది. అర్థరాత్రి నుంచి  సూరయ్యపల్లి  ఎస్సీ కాలనీ వాసులు  భయాందోళనలో ఉన్నారు.  ఖానాపూర్ ప్రజలు  ఇండ్లు ఖాళీ  చేసి  సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.  మంథని పట్టణంలోని  అంబేద్కర్ నగర్, బోయిన్ పేట,  వాసవి నగర్,  సుభాష్ నగర్,  లైన్ గడ్డ,  మర్రివాడ వాసులను పునరావాసానికి  తరలించారు అధికారులు.