
- రిటైర్మెంట్ వయసు పెంపు కూడా లేటే
- ఫిట్మెంట్ ఎరియర్స్ చెల్లింపుపై సందేహాలు
- ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న అధికారవర్గాలు
- ఆందోళనలో ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపు వచ్చే ఏడాది జూన్ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఇప్పట్లో పీఆర్సీని ప్రకటించడం కష్టమని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు హామీ అమలు కూడా జూన్ తర్వాతే ఉండొచ్చని స్పష్టం చేస్తున్నాయి. వీటికి సంబంధించి కొత్త బడ్జెట్లోనే కేటాయింపులు ఉంటాయని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ప్రకటించే చాన్స్ ఉందని సమాచారం.
ఆర్థిక ఇబ్బందులతో..
మాంద్యం కారణంగా నిధులకు ఇబ్బంది ఎదురవుతోందని సీఎం కేసీఆర్ పలుసార్లు చెప్పారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టొద్దని అధికారులు, మంత్రులకు స్పష్టం చేశారని.. చాలా శాఖలకు కేటాయింపుల్లో కోత పెట్టాలని ఆదేశించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన పనులకే తప్ప మిగతా వేటికీ నిధులు మంజూరు కావట్లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రాష్ట్ర అప్పులపై వడ్డీలు, ఆసరా తదితర సంక్షేమ పథకాల చెల్లింపులకే పరిమితం చేశారు.
వచ్చే ఏప్రిల్ వరకు ఇదే తరహా పరిస్థితి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. 2020 ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త బడ్జెట్లోనే ఉద్యోగుల పీఆర్సీ కోసం నిధుల కేటాయింపు ఉంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ‘‘కొత్త బడ్జెట్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తది. మేలో పీఆర్సీ ఉండదు. రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014 జూన్ 2 నుంచి పీఆర్సీని అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే రోజు నుంచి అమలయ్యేలా తెలంగాణ మొదటి పీఆర్సీ ప్రకటన ఉండొచ్చు’’ అని తెలిపారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 ఏండ్లకు పెంచుతూ ఇటీవలే జీవో విడుదలైంది. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంపును కూడా జూన్ 2న ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
పీఆర్సీ కమిటీ రెడీ అయినా..
ఉద్యోగులకు ఏ మేరకు ఫిట్ మెంట్ ఇవ్వాలన్న దానిపై పీఆర్సీ కమిటీ ఇప్పటికే సిఫార్సులను రెడీ చేసిందని సమాచారం. ఇప్పుడే రిపోర్టు ఇవ్వొద్దని, ఇస్తే వెంటనే అమలు చేయాలంటూ ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుందని సర్కారు సూచించినట్టు తెలిసింది. ఈ మేరకే నివేదిక తీసుకోకుండా కమిటీ కాల పరిమితిని పొడిగించారని, ప్రభుత్వ శాఖల్లో కేడర్ స్ట్రెంత్ పై అధ్యయనం చేసే పని ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యోగులు కూడా సంఘీభావం తెలపాలని నిర్ణయించుకోవడంతో… సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. వారితో కలిసి భోజనం చేసి, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధంకావాలంటూ పీఆర్సీ కమిటీకి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలిస్తూ ప్రకటన వెలువడింది. తర్వాత అడుగు ముందుకు పడలేదు. మంత్రులు, అధికారుల్లో ఎవరూ ఆ ప్రస్తావన కూడా తేవడం లేదు
ఎరియర్స్ పై గందరగోళం
వాస్తవానికి ఉద్యోగులకు 2018 జూన్ నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. అయితే సర్కారు 2020 జూన్ 2 నుంచి పీఆర్సీని అమలు చేయాలని యోచిస్తుండటంతో.. ఉద్యోగులు రెండేండ్ల ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. సాధారణంగా ఇలా ఆలస్యంగా పీఆర్సీ ఇస్తే.. నియమిత తేదీ నుంచి చెల్లించాల్సిన ఎరియర్స్‌ను ఒకేసారి చెల్లించడమో, జీపీఎఫ్‌లో జమ చేయడమో చేస్తుంటారు. కానీ ఈసారి ఎరియర్స్ విషయంగా ఎలాంటి హామీ ఉండకపోవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమలు చేసిన రోజు నుంచీ వచ్చే ఫిట్‌మెంట్‌ను మాత్రమే ఉద్యోగులు పొందే అవకాశం ఉందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘‘వచ్చే ఏడాది పీఆర్సీ అమలు చేసినా ఎరియర్స్ మాత్రం ఇచ్చే చాన్స్ లేదు. ఎరియర్స్ ఇవ్వాలంటే ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతోంది” అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.