మీ కష్టం చెప్పండి!.రైతులకు అండగా ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్​

మీ కష్టం చెప్పండి!.రైతులకు అండగా ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్​

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్​తో అన్ని వర్గాల ప్రజలతోపాటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపేందుకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్​సంస్థ సేవ్ ఫార్మర్స్ ఫస్ట్​ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రైతుల సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పంపడంతోపాటు పరిష్కార మార్గాలను చూపిస్తోంది. సేవ్ గ్లోబల్​ ఫార్మర్స్ సంస్థ సేవ్​ఫార్మర్స్ ఫస్ట్ అనే కార్యక్రమంతో  గూగుల్ ఫామ్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ద్వారా రైతుల సమస్యలను తెలుసుకుంటోంది. వాటిని సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టికి ఆ సంస్థ తీసుకెళ్లింది. కొన్ని సమస్యలను మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

కూలీల సమస్య గురించే ఎక్కువ..

నిన్నమొన్నటి వరకూ వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతుల పిల్లలు, కరోనా ఎఫెక్ట్​తో ఇంటి దగ్గరే ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ వర్క్​ఫ్రమ్ హోంతో ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు తమ పేరెంట్స్ పడుతున్న  సమస్యలను గూగుల్ ఫామ్ ద్వారా తెలుపుతున్నారని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ‘పంట చేతికొచ్చింది, కూలీలు దొరకడం లేదు, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేదు, పంటలను ఎక్కడ, ఎలా అమ్మాలి? గన్ని సంచులు దొరకడం లేదు?, వరి తరుగు 5 కిలోలు తీసుకుంటున్నారు’ ఇలా అనేక సమస్యలు తమకు అందినట్లు చెప్పారు. కొందరు రైతులతో నేరుగా గ్రూప్​వీడియో కాలింగ్ ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిస్తున్నట్లు తెలిపారు.

5 వేల మంది కాంటాక్ట్ అయ్యారు

నేనో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్.  ఫ్రెండ్స్ తో కలిసి సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థను ఏర్పాటు చేశాం. లాక్​డౌన్​తో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు #SaveFarmersFirst కార్యక్రమాన్ని ప్రారంభించాం. 5 వేలకు పైగా మంది రైతులు సమస్యలు చెప్పుకున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నం. రైతులు తమ సమస్యలను 7207861297,  99512 66507 , 096520 12969 నంబర్లకు వాట్సప్ చేయవచ్చు.

– రవీందర్ ర్యాడ,
ప్రెసిడెంట్, సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ