హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీలను నిర్వహిస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ (శాట్జ్) శివసేనా రెడ్డి ప్రకటించారు. జనవరి 17 నుంచి గ్రామ స్థాయి పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈసారి ప్రత్యేకంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలతో కలిపి తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా పోటీలు నిర్వహిస్తున్నట్టు మంగళవారం ఎల్బీ స్టేడియంలో జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వెల్లడించారు.
మొత్తం 44 క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీల రాష్ట్ర స్థాయి వేదికలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. సీఎం కప్ సన్నాహకాల్లో భాగంగా జనవరి 8 నుంచి 11 వరకు జిల్లా కేంద్రాల్లో టార్జ్ రిలే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇక, క్రీడాకారుల సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా సేకరించాలని శాట్జ్ ఎండీ సోని బాలాదేవి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.
