సత్యేంద్ర జైన్. భార్య, కుమార్తెలకు మెమోలిచ్చిన ఈడీ

సత్యేంద్ర జైన్.  భార్య, కుమార్తెలకు  మెమోలిచ్చిన ఈడీ

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ నివాస ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. సత్యేంద్ర జైన్ భార్య, కుమార్తెలకు మెమోలను అందచేశారు ఈడీ అధికారులు. రూ. 2 లక్షల 79 వేల 200 దొరికినట్లు మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అవేమీ సీజ్ కాలేదని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కోల్‌క‌తాకు చెందిన ఓ కంపెనీతో ఆయన మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ వ్యవహారంలో కేసు నమోదుచేసింది ఈడీ. గత వారం ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన మూలాన్ని ఆయన వివరించలేదని, అనేక కంపెనీలను కొనుగోలు చేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలను సీఎం కేజ్రీవాల్ ఖండిస్తున్నారు. అవన్నీ అబద్దాలేనని, ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక దాడులు చేస్తున్నారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.