ఇండియాకు టెస్లా!

ఇండియాకు టెస్లా!

ఇండియాకు టెస్లా!
ఈవారంలోనే పీఎంఓతో మీటింగ్​
కాంపోనెంట్స్ పై చర్చించే చాన్స్​

న్యూఢిల్లీ : మన దేశంలో తయారీ చేపట్టే ఉద్దేశంతో మరోసారి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలవడానికి టెస్లా ఇంక్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​లు ఈ వారం ఇక్కడకు వస్తున్నారు. చైనాకు బయట వేరొక తయారీ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలని టెస్లా ఇంక్​ సీరియస్​గా ఆలోచిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆఫీసులోని అధికారులతో సహా మరి కొంత మంది అధికారులతో టెస్లా ఎగ్జిక్యూటివ్స్​ ఈ పర్యటనలో సమావేశం కానున్నారు. టెస్లా మోడల్స్​కు కొన్ని కాంపోనెంట్స్​ను లోకల్​గా సేకరించడం వంటి అంశాలపై ప్రధానంగా డిస్కషన్స్​ జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా ఏళ్లుగా నలుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా టెస్లా ఇంక్​ ఇండియాలోకి అడుగుపెట్టలేదు. ఇండియా విధిస్తున్న అధిక ఇంపోర్ట్​ డ్యూటీలపై టెస్లా సీఈఓ ఎలన్​ మస్క్​ విమర్శలు గుప్పించారు. అంతేకాదు, మన దేశపు ఎలక్ట్రిక్​ వెహికల్స్​ పాలసీపైనా వ్యతిరేకంగా మాట్లాడారు. చైనాలో తయారు చేసిన కార్లను మా దేశంలో అమ్మొద్దని  మరోవైపు ఇండియా టెస్లాకు హితవు చెప్పింది. 

టెస్లా కంపెనీ సప్లయ్​ చెయిన్, ప్రొడక్షన్​, బిజినెస్​ డెవలప్​మెంట్​​ టీములలోని  ముఖ్యులందరూ ఇండియాకు వచ్చే ప్రతినిధి బృందంలో ఉండబోతున్నారు. ఇంపోర్ట్​ డ్యూటీలను తగ్గించాలనే తమ డిమాండ్​ను వారు ప్రభుత్వానికి మరోసారి వినిపించబోతున్నట్లు సమాచారం.  ఇండియా నుంచి కాంపోనెంట్స్​సమకూర్చుకోవడం నిజానికి టెస్లాకు మేలు చేస్తుంది. గ్లోబల్​ మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా దేశాన్ని తీర్చి దిద్దాలనుకుంటున్న మోడీ డ్రీమ్​కు కూడా ఇది అనుకూలమైనదే అవుతుంది. సరిహద్దు సమస్యలుండటంతో చైనాలోని షాంఘై ఫ్యాక్టరీలో తయారయ్యే టెస్లా కార్లను  దేశంలో అమ్మవద్దని  ఇండియా కోరుతోంది.

ఇతర కంపెనీలు మాత్రం...

మరోవైపు టెస్లాకు గ్లోబల్​ ప్రత్యర్ధులైన మెర్సిడెస్​–బెంజ్​ ఏజీ వంటి కంపెనీలు ఇండియాలోనే లోకల్​గా కార్లను అసెంబుల్​ చేసి, అమ్మడానికి ముందుకు వస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు పెరుగుతున్న డిమాండ్​ను అనుకూలంగా మలుచుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. మన దేశంలో ఆటోమొబైల్​ మార్కెట్​కు గ్రోత్​ పొటెన్షియల్​ ఎక్కువని అవి అంచనా వేస్తున్నాయి. 

ఏదేమైనప్పటికీ, తన ఖరీదయిన మోడల్స్​ను ఇండియాలో తయారు చేసే ఆలోచనలో టెస్లా లేదు. మొదటగా కార్లు అమ్మి, సర్వీసింగ్​ చేయడానికి అనుమతి ఇస్తే తప్ప మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీని ఏ దేశంలోనూ పెట్టబోమని మస్క్​ గతంలోనే స్పష్టం చేశారు. కానీ, చైనాకు ఆల్టర్నేటివ్​ వెతుక్కోవల్సిన అగత్యం ఏర్పడటంతో మిగిలిన అమెరికన్​ కంపెనీలలాగే ఇప్పుడు టెస్లా కూడా ఇతర దేశాల వైపు చూడాల్సి వస్తోంది. వాషింగ్టన్​–బీజింగ్​ల మధ్య కూడా ఒక రకమైన ఘర్షణ వాతావరణమే కొనసాగుతోంది. యాపిల్​ ఇంక్​ను టెస్లా ఇంక్​ ఆదర్శంగా తీసుకునే ఛాన్స్​ అయితే కనబడుతోంది. ఇండియాను ఆల్టర్నేటివ్​ మాన్యుఫాక్చరింగ్​ బేస్​గా మలుచుకున్న యాపిల్​ ఇప్పుడు ఇక్కడే 7 శాతం​ స్మార్ట్​ఫోన్లను తయారు చేస్తోంది.