
శ్రీశైలం నిర్మించిందే సాగర్ సప్లిమెంటేషన్ కోసం
కేఆర్‌ఎంబీకి ఘాటుగా రిప్లై ఇచ్చిన తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ రోజుకు 2,250 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోవాలని.. కానీ బచావత్ అవార్డుకు వ్యతిరేకంగా రాయసీమకు నీటిని తరలిస్తోందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నుంచి నాగార్జున సాగర్‌కు నీటి తరలింపును ఆపేలా తెలంగాణను ఆదేశించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్‌ఎంబీ లెటర్ రాయడాన్ని సర్కార్ తప్పుబట్టింది. శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించిందే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, నాగార్జున సాగర్‌కు సప్లిమెంట్ చేయడానికి అని తేల్చిచెప్పింది. బచావత్ అవార్డు సైతం ఇదే పేర్కొన్నట్లు తెలిపింది. కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీకి ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ బుధవారం ఈ మేరకు లెటర్ రాశారు. కేఆర్‌ఎంబీ తీరుపై లేఖలో ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా సాగర్‌కు తరలించే నీళ్లు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడతాయని ఈఎన్సీ తెలిపారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు తక్కువలో తక్కువ 180 టీఎంసీల నీటిని తరలించాలని బచావత్ అవార్డులో క్లియర్‌గా ఉందన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లను డైవర్ట్ చేసే పక్షంలో సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నారు. పులిచింతలకు స్థానిక వరదల ద్వారా 75 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పుడు సైతం సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
నిజాలను బోర్డు గుర్తించాలె..
చెన్నైకి తాగునీటిని ఇచ్చేందుకు 1976 ఏప్రిల్ 14న, 1977 అక్టోబర్ 28న చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తలా 5 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉంటుందని ఈఎన్సీ తెలిపారు. శ్రీశైలం నుంచి రోజుకు 1500 క్యూస్కెకుల నీటిని జూలై నుంచి అక్టోబర్ నెలల మధ్య విడుదల చేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం రైట్ కెనాల్‌కు అదనంగా 19 టీఎంసీల నీటిని ఫ్లడ్ సీజన్‌లో తీసుకునే అవకాశం ఉందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే ఈ నీళ్లను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీని 11,150 క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూస్కెక్కులకు పెంచి పెన్నా బేసిన్‌కు నీటిని తరలిస్తున్నారని తప్పుపట్టారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోందని చెప్పారు. కృష్ణా బోర్డు వాస్తవాలను గుర్తిస్తే మంచిదని సూచించారు. శ్రీశైలం నుంచి రెండు రాష్ట్రాలు తమకు ఉన్న హక్కుల మేరకు నీటిని తీసుకునేలా బోర్డు నిర్దేశిస్తే మంచిదన్నారు.