శివసేన పార్టీ ఎవ‌రిది..? ‘విల్లు ధనుస్సు’ను షిండే లాక్కుంటారా..?

శివసేన పార్టీ ఎవ‌రిది..? ‘విల్లు ధనుస్సు’ను షిండే లాక్కుంటారా..?

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన పార్టీ నాయకత్వ హక్కులపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం న్యాయస్థానంలో ఉండగా... ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని పిటిషన్ లో ప్రశ్నించింది. 

ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ తమదంటే తమేనని ఏక్‌నాథ్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో శివసేన పంచాయతీ కేంద్ర ఎన్నికల సంఘం వరకూ వెళ్లింది. రెండు వర్గాల నేతలు శివసేన పార్టీ తమదేనని ఈసీకి లేఖ రాశాయి. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం శివసేన పార్టీ గుర్తు విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు. దీంతో ఈసీ.. ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపంలో తమకు సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నారనే ఆధారాలనూ తమకు సమర్పించాలని ఆదేశించింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం వరకు అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లను సమర్పించాలని ఈసీ స్పష్టం చేసింది. 

ఈసీ ఆదేశాలతో సుప్రీంకు ఠాక్రే వర్గం
శివసేన తమదేనంటూ ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు వాదిస్తుండగా.. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును కోరింది. ఎమ్మెల్యేల అనర‍్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే విషయంపై ఈసీ  నిర్ణయం తీసుకోలేదని ఠాక్రే వర్గం పిటిషన్‌లో పేర్కొంది. ‘ఈనెల 22న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీని అనుమతించినట్లయితే.. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుల సమస్యలను ఆక్షేపించటమే కాకా.. ఈసీ చర్యల వల్ల కోలుకోలేని దెబ్బపడుతుంది. శాసనసభ్యులుగా అనర్హులైన వారి పిటిషన్లు చెల్లవు. ప్రస్తుత సమయంలో ఈసీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి ’ అని పేర్కొంది. 

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ వర్గం కృత్రిమ మెజారిటీని సృష్టిస్తోందని ఠాక్రే వర్గం పేర్కొంది. కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, ఇతర అంశాలు పెండింగ్‌లో ఉన్న క్రమంలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదని పేర్కొంది. శివసేన ఎవరిదనే అంశంలో ముందుకు వెళ్లకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ఠాక్రే వర్గం తెలిపింది.