
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరీక్ష రాసిన వారి వివరాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పేపర్ లీకేజీ కేసులో నిందితులు ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యను సిట్ ప్రశ్నించింది. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో మంగళవారం వీరిని సిట్ తమ అదుపులోకి తీసుకుంది. చంచల్‌గూడ జైలు నుంచి హిమాయత్‌నగర్‌లోని సిట్ ఆఫీస్‌కి తరలించి విచారించింది.
ముగ్గురు నిందితులను విడివిడిగా ప్రశ్నించి.. వారి వ్యక్తిగత, విద్య, వృత్తికి సంబంధించిన వివరాలను సేకరించింది. మధ్యవర్తి తిరుపతయ్య నుంచి రాజేంద్రకుమార్ ఏఈ పేపర్ కొన్నట్లు సిట్ గుర్తించింది. వీరు ఇచ్చిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏఈ పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నది. తిరుపతయ్య, ఢాక్యనాయక్ కాల్ డేటాను ఆరా తీస్తోంది.
కీలకంగా మారిన తిరుపతయ్య స్టేట్‌మెంట్
ఏఈ పేపర్సేల్ కేసులో నిందితురాలు రేణుక, ఆమె భర్త ఢాక్యనాయక్‌తో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందిన తిరుపతయ్య పేపర్ సేల్ చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. షాద్‌నగర్ నేరెళ్ల చెరువుకు చెందిన రాజేంద్రకుమార్ కు తిరుపతయ్య మధ్యవర్తిగా ఏఈ పేపర్ అమ్మాడు. ఇందుకోసం రూ.5 లక్షలను రాజేంద్రకుమార్.. తిరుపతయ్య ద్వారా ఢాక్యనాయక్‌కు అందించాడు. ముగ్గురి మధ్య లావాదేవీల వివరాలను రాజేంద్రకుమార్ నుంచి సిట్ అధికారులు రాబడుతున్నారు.
తిరుపతయ్యకు ఇచ్చిన క్యాష్‌తోపాటు రాజేంద్రకుమార్ ఏఈ పేపర్ ఎప్పుడు చేరింది.. ఎక్కడ ప్రిపేర్ అయ్యాడనే వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. రాజేంద్రకుమార్‌తోపాటు మరికొందరికి తిరుపతయ్య పేపర్ షేర్ చేసినట్లు అనుమానిస్తున్న సిట్ అధికారులు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్, నేరెళ్ల చెరువు సమీప గ్రామాల్లో ఏఈ పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలను కూడా సేకరిస్తోంది.
పేపర్ ప్రస్తావన ఎప్పుడొచ్చింది?
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్(ఈసీ)గా పనిచేశాడు. అదే డిపార్ట్‌మెంట్‌లో వికారాబాద్ జిల్లా డీఆర్‌డీఏలో ఢాక్యనాయక్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. వీరిద్దరి మధ్య ఏఈ పేపర్ విషయం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చిందనే వివరాలను సిట్ సేకరించింది. ఏఈ పేపర్ ఇవ్వడానికి ఢాక్యనాయక్ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడని ప్రశాంత్ చెప్పినట్లు సమాచారం.
పరీక్షకు ఒక్కరోజు ముందు రూ.7.5 లక్షలు ఇవ్వడంతో ఏఈ పేపర్ షేర్ చేసినట్లు వెల్లడించాడని తెలిసింది. తిరుపతయ్య, ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరికి సిట్నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. తొలి రోజు విచారణ తర్వాత ముగ్గురు నిందితులను సిట్ అధికారులు సీసీఎస్‌కు తరలించారు.