ధరణిలో కొత్త మాడ్యూల్స్ చేర్చరా?

ధరణిలో కొత్త మాడ్యూల్స్ చేర్చరా?

సీఎం కేసీఆర్ దగ్గరే.. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు  
పది రోజులైనా నిర్ణయం     తీసుకోని ముఖ్యమంత్రి 

 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ధరణి పోర్టల్ లో కొత్త మాడ్యూల్స్ చేర్చాలని, తహసీల్దార్లు, కలెక్టర్ల స్థాయిలో మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించి పది రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు అవేవి అందుబాటులోకి రాలేదు. సబ్ కమిటీ రిపోర్టుకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయకపోవడం వల్లే కొత్త మాడ్యూల్స్ తయారీలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసింది.
42 రకాల మాడ్యూల్స్
ధరణి పోర్టల్ తో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని మొదట్లో కొద్ది నెలల వరకు బుకాయించిన ప్రభుత్వం.. ఏడాది తర్వాత అందులో అనేక ఇబ్బందులు ఉన్నట్లు అంగీకరించింది. ఈ క్రమంలోనే ధరణిలో సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలను సూచించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు చైర్మన్ గా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. నవంబర్12న మొదటిసారి సమావేశమైనప్పుడే సుమారు 20 రకాల సమస్యలు సబ్ కమిటీ దృష్టికి వచ్చాయి. రెండో సమావేశంలో మరికొన్ని కొత్త సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో సుమారు 42 రకాల సమస్యల పరిష్కారానికి మాడ్యూల్స్ సిద్ధం చేయగా.. అందుకు సంబంధించిన రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించి ఈ నెల 2న సీఎం కేసీఆర్ కు సమర్పించింది. సబ్ కమిటీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఇంకా ఓకే చెప్పకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు.
కొత్తగా చేర్చాల్సిన మాడ్యుల్స్ ఇవే.. 
రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ లో చేర్చాల్సిన మాడ్యూల్స్ పై కసరత్తు చేసిన అధికారులు, టెక్నికల్ టీమ్ సభ్యులు.. ఆ వివరాలను కేబినెట్‌ సబ్‌కమిటీ ముందు పెట్టారు. వీటిలో ముఖ్యంగా విస్తీర్ణంలో మార్పులు, సర్వే నంబర్ల తొలగింపు, మిస్సింగ్ సర్వే నంబర్ల యాడింగ్, ఎన్‌వోసీ,13-బీ, సర్వే నంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, ల్యాండ్‌ నేచర్‌, ల్యాండ్‌ టైప్‌ను మార్చడం, కొత్త ఖాతా సృష్టించడం, ఖాతాలను కలపడం లేదా విభజించడం, లావాదేవీని నిలిపివేయడం, జాయింట్‌ పట్టా, జీపీఏ విత్‌ పీపీపీబీ, పట్టాదార్‌ పాస్‌పుస్తకం లేని భూములకు జీపీఏ, పీటీ సర్టిఫికెట్లు తదితర సమస్యలపై మాడ్యూల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.