
చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండకపోవచ్చు.. కాలం మారింది అనటానికి ఇదే నిదర్శనం.. ఎండాకాలం అయిపోలేదు.. అప్పుడే నైరుతి రుతు పవనాలు వచ్చేశాయి. రోహిణి కార్తెలోనే వానాకాలం వచ్చేసింది. అనుకున్న టైం కంటే.. 13 రోజులు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు వచ్చేశాయి. వానలు మొదలయ్యాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాను తాకిన నైరుతి రుతు పవనాలతో వాతావరణ చల్లబడింది. జల్లులు పడుతున్నాయి. మరో నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికితోడు ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో.. వర్షాలు గట్టిగానే పడనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే నైరుతి రుతు పవనాల ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలో అతి భారీ వర్షాల హెచ్చరికలతో 10 జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఏపీలోకి కూడా నైరుతి రుతు పవనాలు వచ్చేశాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతు పవనాల విస్తరణ అత్యంత వేగంగా ఉంది. వారం ముందుగానే ఏపీని టచ్ చేయగా.. 13 రోజుల ముందే తెలంగాణలోకి ఎంట్రీ అయిపోయాయి రుతు పవనాలు.
ఉపరితల ద్రోణి, నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఇవ్వగా.. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
నైరుతి రుతు పవనాలకు మరింత బలాన్ని ఇస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నది. ఈ అల్పపీడనం బలపడితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయి.
రోహిణి కార్తె జూన్ 8వ తేదీ వరకు ఉండగా.. రోహిణి కార్తె ప్రారంభం రోజునే తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు రావటం అనేది విశేషం.