హైదరాబాద్లో పాత బండ్ల తరలింపునకు రంగం సిద్ధం.. త్వరలో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్..

హైదరాబాద్లో పాత బండ్ల తరలింపునకు రంగం సిద్ధం.. త్వరలో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్..
  • రోడ్లపై ఏండ్లుగా పడి ఉన్న వెహికల్స్​తో సిటీలో ట్రాఫిక్
  • చుట్టూ దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో అపరిశుభ్రంగా పరిసరాలు
  • అన్ యూజ్డ్ వెహికల్స్​పై​ త్వరలో సర్వే, ఆ తర్వాత డ్రైవ్
  • పోలీసుల సేవలూ తీసుకోనున్న బల్దియా

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ రోడ్లపై ఏండ్లుగా పనికిరాకుండా పడి ఉన్న వాహనాల తొలగింపునకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. పాత బండ్లను వాడకుండా రోడ్లపై పెట్టడడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతోపాటు చుట్టూ దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా గ్రేటర్ పరిధిలో అన్ యూజ్డ్ వాహనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని బల్దియా నిర్ణయించింది. 

సర్వే పూర్తయిన వెంటనే రోడ్లపై పడి ఉన్న వాహనాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయించారు. ఈ డ్రైవ్‌లో సేకరించిన వాహనాలను దుండిగల్​లోని  యార్డుతో పాటు ఇంకొన్ని ప్రాంతాలకు తరలించనున్నారు. రోడ్లను ఖాళీ చేసి ట్రాఫిక్​ను సులభతరం చేయడంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో త్వరలో జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమాన్ని 
చేపట్టనుంది.  

పోలీసులతో సహకారంతో డ్రైవ్..

ఈ డ్రైవ్​లో  పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని బల్దియా నిర్ణయించింది. రోడ్లపై వాహనాలను వదిలేసిన యజమానులను గుర్తించడం, వారికి నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత వాహనాలను తరలించడం వంటి ప్రక్రియలకు పోలీసుల సహకారం అవసరముంది. పోలీసుల పర్యవేక్షణలో ఈ తరలింపు ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వివాదాలకు తావు లేకుండా జరుగుతుందని జీహెచ్‌ఎంసీ భావిస్తున్నది. 

ఓనర్లు ముందే తీసుకొస్తే బెటర్!

ఎటువంటి పనికిరాని, 20 ఏండ్లు అంతకు మించి అన్ యూజ్డ్ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేసి ఉన్న వాహనాల ఓనర్లు వారంతట వారే ముందుగా స్క్రాప్ చేస్తే  బెటర్ అని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఓనర్లకు కూడా ఎంతో కొంత నగదు వచ్చే అవకాశముంది. కానీ రోడ్లపై పెట్టడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

లేదంటే జీహెచ్ఎంసీ డ్రైవ్ లో భాగంగా అన్నింటిని తొలగించి శివారు ప్రాంతాలకు తరలించనున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు వాటిని తుక్కుగా మార్చనున్నారు. టూ వీలర్ నుంచి మొదలు పెడితే హెవీ వెహికిల్స్ ని కూడా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. పెద్ద వాహనాలను లిఫ్ట్ చేసేందుకు జీహెచ్ఎంసీ వద్ద ఎక్యూప్ మెంట్ లేదు. దీంతో సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. వారి సాయంలో వాహనాలను తొలగించనున్నారు.