హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ2025–-30 అమల్లోకి తీసుకొచ్చింది. పర్యాటక రంగ సమగ్ర అభివృద్ధితోపాటు భారీగా పెట్టుబడులను ఆకర్షించి, లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఇందుకోసం ఈ ఏడాది పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.1,224 కోట్లు కేటాయించింది. 2025–26 సంవత్సరానికి రూ.755 కోట్లు కేటాయించగా.. ఈసారి టూరిజానికి రూ.469 కోట్లు అదనంగా నిధులు కేటాయించింది. ఈ నిధులతో చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు.
రూ.25 వేల కోట్ల పెట్టుబడులు
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పర్యాటక విధానానికి ప్రైవేటు రంగం నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే రూ.25,000 కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందగా.. ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయి.
