ఫిబ్రవరిలోనే తెలంగాణ మున్సిపోల్స్..

ఫిబ్రవరిలోనే తెలంగాణ మున్సిపోల్స్..
  • మేడారంలో నిర్వహించిన కేబినెట్‌‌లో నిర్ణయం
  • 2027లో గోదావరి పుష్కరాలు.. బాసర టు భద్రాచలం టెంపుల్‌‌ సర్క్యూట్‌‌ 
  • పూర్తి నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
  • మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం.. రూ. 2,787 కోట్లు మంజూరు
  • ములుగు జిల్లాపై వరాల జల్లు.. పొట్లాపూర్ లిఫ్ట్‌‌కు గ్రీన్ సిగ్నల్

మేడారం నుంచి వెలుగు ప్రతినిధి: రాష్ట్రంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున.. ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కేబినెట్  ఆదేశించింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేకుండా షెడ్యూల్ రూపొందించాలని సూచించింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన హైదరాబాద్‌‌ను దాటి రాష్ట్ర మంత్రివర్గం తొలిసారిగా అడవి బిడ్డల నడుమ, వనదేవతల సన్నిధిలో కొలువుదీరింది. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇప్పటివరకూ ఎన్నడూ లేనివిధంగా.. హైదరాబాద్ వెలుపల మేడారంలోని హరిత హోటల్‌‌లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.  

గోదావరి తీరం.. ఆధ్యాత్మిక తోరణం

2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు  గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేబినెట్  నిర్ణయించింది.బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఈ ప్రాంతాన్ని ఒక ‘టెంపుల్ సర్క్యూట్’గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖలు సంయుక్తంగా మార్చి 31 నాటికి సమగ్ర ప్రణాళిక నివేదించాలని కేబినెట్ ఆదేశించిది. 

యుద్ధప్రాతిపదికన మెట్రో 2 భూసేకరణ

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, నిర్వహణపై కేబినెట్ సమీక్ష చేసినట్లు మంత్రులు వెల్లడించారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో ఫేజ్–-1 ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.  కేంద్రం ఆమోదం పొందేలా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఫేజ్-2 ఏ (4 కారిడార్లు), ఫేజ్-2 బీ (3 కారిడార్లు) పనుల కోసం భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. ఇందుకోసం అవసరమయ్యే రూ. 2,787 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

మేడారం గడ్డపైనుంచి ములుగుకు వరం

కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశం జరిగిన ములుగు జిల్లా ప్రజలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. జిల్లాలో కొత్తగా ‘పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్’ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి.. ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపనున్నారు. దీంతో 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. రూ. 143 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టాలని కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు.

ఫిబ్రవరి 15కల్లా మున్సిపల్ ఎన్నికలు పూర్తి

మున్సిపల్ పోరుకు ముహూర్తం ఖరారైనట్లేనని, ఫిబ్రవరి15కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని మేడారం వేదికగా జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సి ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరగగా.. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి15న మహా శివరాత్రి పర్వదినంలోపే పోలింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. మున్సిపల్ పోరులో విజయమే లక్ష్యంగా మంత్రులు పని చేయాలని, కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేయాలని, ముఖ్యంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ చట్టపరమైన రిజర్వేషన్లకు అదనంగా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీకి నిలబెట్టాలని సీఎం సూచించారు. తద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 45 శాతం మేర పదవులు దక్కేలా చూడాలని, ఆ దిశగా వ్యూహరచన చేయాలని మంత్రులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

మరిన్ని నిర్ణయాలివే..

  •     హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బంజారాహిల్స్‌‌లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణానికి ఆమోదం.
  •     హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ‘ఎకో టౌన్’ అభివృద్ధికి టీజీఐఐసీకి 494 ఎకరాల భూమి కేటాయింపు.
  •     నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరు. 
  •     వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం.