కనీస స్కేల్ రూ.19 వేలు.. అత్యధికం లక్షా 62 వేలు

V6 Velugu Posted on Jun 12, 2021

  • పెంచిన వేతనాలు జూన్‌‌ నుంచే చెల్లింపు 
  • జులైలో కొత్త జీతాలు.. హెచ్‌‌ఆర్‌‌ఏ స్లాబుల్లో కోత
  • రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు గ్రాట్యుటీ
  • 70 ఏండ్లు దాటిన వారికి అదనపు పెన్షన్
  • కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకూ 30% పెంపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఉద్యోగులు, పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతన స్కేల్‌‌‌‌ రూ.19 వేలు, అత్యధిక వేతన స్కేలు రూ.1,62,070లుగా నిర్ణయించింది. హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏ స్లాబుల్లో కోతలు పెట్టింది. గ్రాట్యూటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులకు వేతనాలు పెంచింది. పెంచిన వేతనాలు జూన్‌‌‌‌ నుంచి అమలు చేస్తామని, జూలై నెలలో కొత్త జీతాలు అందుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఫస్ట్‌‌‌‌ పే రివిజన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (పీఆర్సీ) 7.5 శాతం ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికమండ్‌‌‌‌ చేయగా, రాష్ట్ర కేబినెట్‌‌‌‌ 30 శాతం ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్‌‌‌‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌‌‌‌ ఈ విషయం ప్రకటించారు. ఈనెల 8న నిర్వహించిన కేబినెట్‌‌‌‌ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. కేబినెట్‌‌‌‌ ఆమోదంతో ఆర్థిక శాఖ వేర్వేరు జీవోలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులకు 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లుగా మాస్టర్‌‌‌‌ స్కేళ్లు ప్రకటించారు. పెరిగిన వేతనాలు 2018 జూన్‌‌‌‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. 2020 ఏప్రిల్‌‌‌‌ నుంచి ఈ ఏడాది మే నెల చెల్లించాల్సిన ఎరియర్స్‌‌‌‌ ఉద్యోగులు రిటైర్‌‌‌‌ అయిన తర్వాత చెల్లిస్తారు. ఏప్రిల్‌‌‌‌, మే నెలలకు సంబంధించి పెంచిన వేతనం ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌, వర్క్‌‌‌‌ చార్జెడ్‌‌‌‌ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి.

కనీస పెన్షన్ మొత్తం పెంపు

ఉద్యోగులకు రిటైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ తర్వాత ఇచ్చే గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచారు. 2020 ఏప్రిల్‌‌‌‌ ఒకటో తేదీ నుంచి పెంచిన గ్రాట్యుటీ అమల్లోకి వస్తుందని, నిరుడు ఏప్రిల్‌‌‌‌ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు రిటైర్‌‌‌‌ అయిన ఉద్యోగులకు పెంచిన గ్రాట్యుటీ 36 నెలల్లో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్ల రూపంలో చెల్లిస్తామని పేర్కొన్నారు. రిటైర్‌‌‌‌ అయిన ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌‌‌‌, ఫ్యామిలీ పెన్షన్‌‌‌‌ కనీస మొత్తాన్ని రూ.9,500లకు పెంచారు. పెంచిన పెన్షన్‌‌‌‌ 2018 జూన్‌‌‌‌ నుంచి అమల్లోకి వస్తుందని, మానిటరీ బెనిఫిట్‌‌‌‌ నిరుడు ఏప్రిల్‌‌‌‌ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. నిరుడు ఏప్రిల్‌‌‌‌ నుంచి ఈ ఏడాది మే వరకు చెల్లించాల్సిన బకాయిలను 36 నెలల్లో చెల్లిస్తామన్నారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్‌‌‌‌ స్కీం వారి కుటుంబీకులకు ఫ్యామిలీ పెన్షన్‌‌‌‌ వర్తింపజేశారు. గతంలో 75 ఏళ్లు దాటిన వారికి అదనపు పెన్షన్‌‌‌‌ ఇవ్వగా.. ఇప్పుడు వయోపరిమితిని ఐదేళ్లు తగ్గించారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చే సిటీ కాంపన్సేటరీ అలవెన్స్‌‌‌‌ పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులకు ఎలాంటి వేతన బకాయిలు చెల్లించరు. జూన్‌‌‌‌లో పెరిగే జీతాన్ని జూలై నెలలో చెల్లిస్తారు. ఈ కేటగిరీ ఉద్యోగులకు మూడు స్కేళ్లు ప్రకటించారు. రూ.15,600, రూ.19,500, రూ.22,750 కనీస వేతనాలు ఆయా కేటగిరీల ఉద్యోగులకు వర్తింపజేయనున్నారు.

అద్దె అలవెన్స్ తగ్గింపు

ఉద్యోగులకు చెల్లించే ఇంటి అద్దె అలవెన్స్‌‌‌‌ స్లాబుల్లో కోతలు పెట్టారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో గతంలోని 30 శాతం హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏను 24 శాతానికి తగ్గించారు. 2 లక్షలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న కరీంనగర్‌‌‌‌, ఖమ్మం, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, రామగుండం, వరంగల్‌‌‌‌ నగరాల్లో 20 శాతం ఉండగా 17 శాతానికి తగ్గించారు. 50 వేల నుంచి 2 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణా ల్లో 14.5 శాతం నుంచి 13 శాతానికి తగ్గిం చారు. 50 వేల జనాభా కన్నా తక్కువున్న  ప్రాంతాల్లో 12 నుంచి 11 శాతానికి తగ్గించా రు. ఉద్యోగి మూల వేతనం, వారు పని చేసే ప్రాంతం ఆధారంగా హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏ చెల్లిస్తారు. హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏపై గరిష్ట పరిమితి తొలగించారు.

Tagged state government, Employees, KCR, PRC, orders implementing, ensioners

Latest Videos

Subscribe Now

More News