గ్యారంటీ అప్పులపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన

గ్యారంటీ అప్పులపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన

హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా పూర్తి స్థాయిలో పర్మిషన్ రాలేదు. శుక్రవారం ఆర్‌‌‌‌బీఐ రిలీజ్ చేసిన ప్రకటనలోనూ తెలంగాణకు తాత్కాలికంగానే రుణమిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఈ నెల 7వ తేదీన రూ.4 వేల కోట్లు తీసుకుంటున్నప్పటికీ.. వచ్చే నెలలో ఎలా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌లో ఎంత అప్పు తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి ఇవ్వనున్నారో కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి 2022–23లో రూ.59 వేల కోట్ల అప్పును జీఎస్‌‌డీపీ పరిధిలో తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌‌లో టార్గెట్ పెట్టుకున్నది. అయితే ఆ తర్వాత దాన్ని రూ.52 వేల కోట్లకు తగ్గించుకుంది. ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గ్యారంటీ అప్పులు తీసుకోవాలనుకుంటే వాటి చెల్లింపులు బడ్జెట్‌‌లో నుంచే కట్టాల్సి వస్తే.. ఆ ఆప్పులను కూడా ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలోనే కలుపుతామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తీసుకునే అప్పులో కోత పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.

చెల్లింపులపై రోడ్‌‌ మ్యాప్ ఇవ్వాలె

వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీతో తీసుకుంటున్న అప్పులపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అప్పులను ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలోకి రాకుండా.. బడ్జెటేతర అప్పుగా చూపించాలంటే కొన్ని అంశాల్లో రాష్ట్రాలు కచ్చితమైన సమాచారం చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. ఏదైనా కార్పొరేషన్ కింద అప్పు తీసుకుంటే.. ఆ అప్పును తిరిగి ఎలా చెల్లిస్తారనే దానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలని సూచించింది. సర్కారు చెప్పింది సాధ్యపడుతుందని అనుకున్నప్పుడే దాన్ని బడ్జెటేతర అప్పుగా గుర్తిస్తామని.. లేదంటే ఎఫ్ఆర్‌‌‌‌బీఎం అప్పుల్లో కలిపి చూస్తామని స్పష్టం చేసింది. ఉదాహరణకు ఇప్పుడు కాళేశ్వరం కోసం రూ.60 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గ్యారంటీతో తెచ్చుకున్నది. అయితే తిరిగి చేసే చెల్లింపులపై మాత్రం ఒక విధానం లేదు. ఇండస్ర్టీలకు నీటిని ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బులతో అప్పులకు చెల్లింపులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే అది సాధ్యపడేలా లేదు. ఫలితంగా బడ్జెట్‌‌లో నుంచే ఈ అప్పును చెల్లించాల్సి వస్తున్నది. అలాంటప్పుడు ఈ అప్పును ఎఫ్ఆర్‌‌‌‌బీఎం పరిధిలోకి తీసుకుని లెక్కగడుతామని కేంద్రం చెప్పింది. ఇక మిషన్ భగీరథ విషయంలో తాగునీటికి పన్నులు వేసే చెల్లిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ చెప్పింది. పోయిన ఏడాది మున్సిపాలిటీల్లో తాగునీటికి పన్ను వేసి రూ.160 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు చెప్పినట్లు తెలిసింది.