బీరుపై 10, క్వార్టర్ పై 10, హాఫ్ బాటిల్ పై 20 పెంపు

 బీరుపై 10, క్వార్టర్ పై 10, హాఫ్ బాటిల్ పై 20 పెంపు
  • బ్రాండ్ ను బట్టి ఫుల్ బాటిల్ పై 40 నుంచి 80 
  • ఇయ్యాల్టి నుంచే అమల్లోకి రానున్న ధరలు 
  • పాత స్టాక్​నూ కొత్త రేట్లకే అమ్మాలన్న ఎక్సైజ్ శాఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర సర్కార్ మరోసారి లిక్కర్ రేట్లు పెంచింది. బీరు, విస్కీ, స్కాచ్ అనే తేడా లేకుండా అన్ని రకాల బ్రాండ్లపై 10 శాతం దాకా బాదేసింది. బీరుపై రూ.10, క్వార్టర్‌‌‌‌ బాటిల్ పై రూ.10, హాఫ్ బాటిల్‌‌‌‌పై రూ.20, ఫుల్‌‌‌‌ బాటిల్‌‌‌‌పై బ్రాండ్‌‌‌‌ను బట్టి రూ.40 నుంచి రూ.80 వరకు వడ్డించింది. కొత్త రేట్లు గురువారం నుంచే అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే డిపోల నుంచి లిఫ్ట్ అయిన మద్యం కూడా కొత్త రేట్లకే అమ్మాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం డిపోల్లో పంపిణీ బంద్‌‌‌‌ చేశారు. ఒక్క బాటిల్‌‌‌‌ కూడా సరఫరా చేయలేదు. వైన్స్ లలో పాత స్టాక్ ఎంతుందో లెక్కించాలని ఉదయమే ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆబ్కారీ అధికారులు బుధవారం అర్ధరాత్రి వైన్స్‌‌‌‌లలో స్టాక్‌‌‌‌ను లెక్కించి సీల్ వేశారు. పెంచిన రేట్ల ప్రకారం పాత స్టాక్ పై అదనంగా డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. దీంతో మద్యం దుకాణాదారులు లబోదిబోమంటున్నారు. పాత స్టాక్ ను కొత్త రేట్లకు అమ్మితే కస్టమర్లు ప్రశ్నిస్తారని, వాళ్లకు ఏం సమాధానం చెప్పాలని వాపోతున్నారు. ఇది ఎమ్మార్పీ వయొలేషన్ కిందికి వస్తుందంటున్నారు. 
ఏటా రెండు వేల కోట్ల ఆదాయం.. 
రాష్ట్రంలో 2,620 వైన్స్‌‌‌‌.. 1,100 దాకా బార్లు, క్లబ్‌‌‌‌లు, పబ్‌‌‌‌లు ఉన్నాయి. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం నెలకు రూ.180 కోట్ల దాకా అదనపు ఆదాయం వస్తుందని, ఏటా రూ.2 వేల కోట్ల రాబడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 31 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2019 నుంచి 2021 ఎక్సైజ్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో రెండేండ్లలో రూ. 54 వేల కోట్ల విలువైన లిక్కర్‌‌‌‌ సేల్‌‌‌‌ అయింది. కాగా లిక్కర్‌‌‌‌లో తయారు చేసేటోళ్లు, అమ్మేటోళ్ల కంటే సర్కారుకే 75 శాతం వరకు  ఆమ్దానీ వస్తోంది. 

మూడోసారి పెంపు.. 

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక మూడుసార్లు లిక్కర్‌‌‌‌ రేట్లు పెంచింది. 2019 డిసెంబర్‌‌‌‌లో 20 శాతం మద్యం ధరలను పెంచింది. ఆ తర్వాత 2020 మార్చిలో కరోనా వల్ల వైన్స్ బంద్‌‌‌‌ అయ్యాయి. మేలో తిరిగి ప్రారంభించగా కరోనా పాండమిక్‌‌‌‌ సెస్‌‌‌‌ పేరుతో మరో 20 నుంచి 25 శాతం దాకా రేట్లు పెంచింది. అయితే దీన్ని సెస్ పేరుతో చూపించకుండా, ఇతర పన్నుల్లో కలిపేస్తున్నారు. కరోనా టైంలో అన్ని రాష్ట్రాల్లో పెంచిన సెస్‌‌‌‌ తగ్గించినా, రాష్ట్ర సర్కార్ మాత్రం కొనసాగిస్తోంది. ఇప్పుడు మరోసారి రేట్లు పెంచింది. రేట్ల పెంపుతో తెలంగాణ కూడా మరో ఏపీలో మారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చుట్టు పక్క రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర కంటే తెలంగాణలోనే అధిక రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పెంచడంతో ఏపీలో మాదిరి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరా అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.