- 76 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఇండియా చిత్తు
- గత ఎడిషన్ ఫైనల్ ఓటమికి సఫారీల ప్రతీకారం
- సత్తా చాటిన మిల్లర్, బౌలర్లు.. బుమ్రా, దూబే పోరాటం వృథా
అహ్మదాబాద్: లీగ్ దశలో చిన్న జట్లపై బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా కీలకమైన సూపర్–8 రౌండ్ ఆరంభంలోనే చతికిలపడింది. పేరున్న బ్యాటర్లంతా పేలవ ఆటతో నిరాశపరచడంతో ఆదివారం జరిగిన గ్రూప్–1 తొలి పోరులో 76 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. డేవిడ్ మిల్లర్ (35 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63)కు తోడు డెవాల్డ్ బ్రెవిస్ (29 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45), ట్రిస్టన్ స్టబ్స్ (24 బాల్స్‌లో 1 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 నాటౌట్) దంచికొట్టడంతో తొలుత సఫారీ టీమ్ 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. బుమ్రా (3/15) మూడు, అర్ష్‌దీప్ సింగ్ (2/28) రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌లో ఇండియా 18.5 ఓవర్లలో 111 రన్స్‌కే కుప్పకూలింది. శివమ్ దూబే (37 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 42) ఒక్కడే పోరాడాడు. సఫారీ బౌలర్లలో యాన్సెన్ (4/22), కేశవ్ మహారాజ్ (3/24), కార్బిన్ బాష్ (2/12) దెబ్బకొట్టారు. మిల్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వేతో ఇండియా పోటీ పడనుంది.
20/3 నుంచి 187/7 వరకు
టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన ఇండియా కొత్త బాల్‌తో దుమ్మురేపింది. పేస్ లీడర్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ స్టార్టింగ్‌లో సఫారీలను దెబ్బమీద దెబ్బకొట్టి అద్భుత ఆరంభం అందించారు. రెండో ఓవర్లోనే ఓపెనర్ క్వింటన్ డికాక్ (6)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే ఫామ్‌లో ఉన్న కెప్టెన్ మార్‌క్రమ్ (4) అర్ష్‌దీప్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడి మిడాఫ్‌లో పాండ్యాకు చిక్కాడు. ఆ తర్వాతి బాల్‌కే సిక్స్ కొట్టిన ర్యాన్ రికెల్టన్ (7)ను బుమ్రా స్లో బాల్‌తో బోల్తా కొట్టించడంతో 20/3తో సఫారీ టీమ్ కష్టాల్లో పడింది. టాపార్డర్ పూర్తిగా తేలిపోయిన వేళ మిడిలార్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. డేవిడ్ మిల్లర్ ఇండియా బౌలింగ్‌కు ఎదురు నిలిచి జట్టును ఆదుకున్నాడు. ఐదో ఓవర్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి వరుస ఫోర్లతో వెల్‌కం చెప్పిన అతను అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మరో రెండు బౌండరీలు రాబట్టడంతో పవర్ ప్లేను సఫారీ టీమ్ 41/3తో ముగించింది. మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్న బ్రెవిస్ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. చక్రవర్తి వేసిన తొమ్మిదో ఓవర్లో మిల్లర్ 95 మీటర్ల సిక్స్ కొడితే.. బ్రెవిస్ 4, 6తో స్పీడు పెంచాడు. హార్దిక్ బౌలింగ్‌లోనూ మిల్లర్ మరో భారీ సిక్స్‌తో అలరించగా.. దూబే వేసిన 11వ ఓవర్లో బ్రెవిస్ 4, 6తో స్కోరు వంద దాటించాడు. దూబే వేసిన 13వ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన బ్రెవిస్ తర్వాతి బాల్‌కే అభిషేక్‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 97 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అయినా వెనక్కుతగ్గని మిల్లర్ అదే ఓవర్లో సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడైన స్టబ్స్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. చక్రవర్తి వేసిన 16వ ఓవర్లో సిక్స్‌తో స్కోరు 150 దాటించాడు. అదే ఓవర్లో మిల్లర్ ఔటవగా... తర్వాతి మూడు ఓవర్లలో బుమ్రా, అర్ష్‌దీప్ 15 రన్స్ మాత్రమే ఇచ్చి యాన్సెన్ (2), కార్బిన్ బాష్ (5)ను ఔట్ చేశారు. కానీ, హార్దిక్ వేసిన చివరి ఓవర్లో స్టబ్స్ 4, 6, 6 సహా 20 రన్స్ రాబట్టి తమ జట్టుకు మంచి స్కోరు అందించాడు.
పెవిలియన్‌కు క్యూ
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియా ఏదశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. టాప్, మిడిలార్డర్ ఫెయిలవడంతో ఆరంభం నుంచే ఎదురీత మొదలు పెట్టింది. టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో ఇండియా ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఈ పోరులో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇన్‌ఫామ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (0) నాలుగో బాల్‌కే డకౌటయ్యాడు. తొలి ఓవర్లోనే స్వయంగా బౌలింగ్‌కు దిగిన మార్‌క్రమ్ స్పిన్ వ్యూహంలో చిక్కాడు. మార్‌క్రమ్ స్లో టాస్‌కు కవర్స్‌లో రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రెండో ఓవర్లో యాన్సెన్ ఎక్స్‌ట్రా బౌన్స్‌ను అర్థం చేసుకోలేక తిలక్ వర్మ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీనికి రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. అదే ఓవర్లో సూర్య (22 బాల్స్‌లో 18) రెండు ఫోర్లు కొట్టగా.. బౌండరీతో టోర్నీలో ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ (15) రబాడ ఓవర్లో 6,4తో టచ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. కానీ, ఐదో ఓవర్లో యాన్సెన్ నకుల్ బాల్‌కు అతను కార్బిన్ బాష్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా 26/3తో కష్టాల్లో పడి పవర్ ప్లేను 31-/3తో ముగించింది.
ఎంగిడి సహా సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సూర్య స్లో అయ్యాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ సుందర్ (11) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. స్పిన్నర్ కేశవ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతడిని ఎనిమిదో ఓవర్లో పెవిలియన్ చేర్చిన కార్బిన్ బాష్ తన తర్వాతి ఓవర్లో 144 స్పీడ్ బాల్‌తో కెప్టెన్ సూర్యను కూడా ఔట్ చేశాడు. దాంతో 51/5తో ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా (18), శివమ్ దూబే ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కు 35 రన్స్ జోడించి ఆశలు రేపారు. కానీ, 15వ ఓవర్లో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పాండ్యాతో పాటు రింకూ సింగ్ (0), అర్ష్‌దీప్ (1)ను ఔట్ చేసి సఫారీల విజయం ఖాయం చేశాడు. ఒంటరి పోరాటం చేస్తున్న దూబేతో పాటు బుమ్రాను యాన్సెన్ వరుస బాల్స్‌లో పెవిలియన్ చేర్చడంతో మరో 7 బాల్స్ మిగిలుండగానే ఇండియా కథ ముగిసింది.
- టీ20 వరల్డ్ కప్స్‌లో రన్స్ పరంగా ఇండియాకు ఇది అతి పెద్ద ఓటమి. 2010లో ఆస్ట్రేలియా చేతిలో 49 రన్స్ తేడాతో ఓడిన రికార్డు బ్రేక్ అయింది.
- 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే వేదికపై ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత అన్ని రకాల ఐసీసీ ఈవెంట్లలో 18 మ్యాచ్‌ల్లో అజేయంగా కొనసాగిన ఇండియాకు ఇదే తొలి ఓటమి.
- 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన తర్వాత మల్టీ నేషన్స్ టీ20 టోర్నీల్లో ఇండియాకు ఇదే తొలి ఓటమి. 23 మ్యాచ్‌ల్లో 21 గెలవగా ఒక దాంట్లో ఫలితం తేలలేదు ఇప్పుడు ఓ మ్యాచ్‌లో ఓడింది.
- టీ20 వరల్డ్ కప్స్‌లో ఇండియాకు ఇది మూడో లోయెస్ట్ స్కోరు. 2016లో న్యూజిలాండ్‌పై 79 రన్స్, 2021లో అదే జట్టుపై 110 రన్స్ చేసింది.
- 33 టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా తీసిన వికెట్లు ఇండియా బౌలర్‌కు అత్యధికం. రవిచంద్రన్ అశ్విన్ (32) రికార్డును బ్రేక్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా 32 వికెట్లతో అశ్విన్ రికార్డును సమం చేశాడు.
స్కోర్‌బోర్డ్
సౌతాఫ్రికా: మార్‌క్రమ్ (సి) పాండ్యా (బి) అర్ష్‌దీప్ 4, డికాక్ (బి) బుమ్రా 6, రికెల్టన్ (సి) దూబే (బి) బుమ్రా 7, బ్రెవిస్ (సి) అభిషేక్ (బి) దూబే 45, మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 63, స్టబ్స్ (నాటౌట్) 44, యాన్సెన్ (సి) సింగ్ (బి) అర్ష్‌దీప్ 2, కార్బిన్ బాష్ (సి అండ్ బి) బుమ్రా 5, రబాడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు:11; మొత్తం: 20 ఓవర్లలో 187/7; వికెట్ల పతనం: 1-–-10, 2–-12 , 3–-20, 4–-117, 5–-152, 6–-158, 7-–167; బౌలింగ్: బుమ్రా 4–0–15–3, అర్ష్‌దీప్ సింగ్ 4–0–28–2, వరుణ్ చక్రవర్తి 4–0–47–1, శివమ్ దూబే 2–0–32–1, వాషింగ్టన్ సుందర్ 2–0–17–0, హార్దిక్ 4–0–45–0.
ఇండియా: ఇషాన్ (సి) రికెల్టన్ (బి) మార్‌క్రమ్ 0, అభిషేక్ (సి) బాష్ (బి) యాన్సెన్ 15, తిలక్ వర్మ (సి) డికాక్ (బి) యాన్సెన్ 1, సూర్యకుమార్ (సి) బ్రెవిస్ (బి) బాష్ 18, సుందర్ (సి) డికాక్ (బి) బాష్ 11, దూబే (సి) ఎంగిడి (బి) యాన్సెన్ 42, హార్దిక్ (సి) స్టబ్స్ (బి) మహారాజ్ 18, రింకూ సింగ్ (సి) స్టబ్స్ (బి) మహారాజ్ 0, అర్ష్‌దీప్ (సి) స్టబ్స్ (బి) మహారాజ్1, చక్రవర్తి (నాటౌట్) 0, బుమ్రా (సి) మార్‌క్రమ్ (బి) యాన్సెన్ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.5 ఓవర్లలో 111 ఆలౌట్; వికెట్ల పతనం: 1-–0, 2–-5, 3–-26, 4-–43, 5-–51, 6-–86, 7–-86, 8–-88, 9–-111, 10–-111; బౌలింగ్: మార్‌క్రమ్ 1–0–5–1, మార్కో యాన్సెన్ 3.5–0–22–4, కగిసో రబాడ 4–0–32–0, లుంగి ఎంగిడి 4–0–15–0, కేశవ్ మహారాజ్ 3–0–24–3, కార్బిన్ బాష్ 3–0–12–2.
