- అందని ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యాలు
- మరుగుదొడ్లు లేక మహిళా రైతులు, అధికారుల ఇబ్బందులు
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 476 వేదికల దుస్థితి
వనపర్తి, వెలుగు: రైతులకు సాగుపై అవగాహన కల్పించేందుకు, ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సూచనలను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మించింది. ఒక్కో క్లస్టర్‌కు రూ.22 లక్షలతో వీటిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 476 రైతు వేదికలు ఉండగా, అందులో నాగర్ కర్నూలులో 143, గద్వాలలో 97, మహబూబ్‌నగర్‌లో 88, నారాయణపేటలో 77, వనపర్తి జిల్లాలో 71 వేదికలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని మండల కేంద్రాల్లో మినహా, గ్రామీణ ప్రాంతాల్లోని వేదికలు నిరుపయోగంగా మారుతున్నాయి.
నెలకు రూ.9 వేల నిధులు రాక ఇబ్బంది..
ప్రతీ రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ.9 వేల నిధులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అవి సక్రమంగా విడుదల కాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు రోజూ నిర్ణీత సమయాల్లో రైతులకు ఇక్కడ అందుబాటులో ఉండాలి. కానీ, నిర్వహణ ఖర్చులు అందక చాలా చోట్ల వారానికి రెండు సార్లు జరగాల్సిన సమావేశాలు నెలకొకసారి కూడా జరగడం లేదు. కనీసం ఇంటర్నెట్ సౌకర్యం కోసం అధికారులు తమ సొంత ఖర్చులను వెచ్చిస్తూ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్ష్యం నెరవేరాలంటే..
కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ వేదికలు కేవలం భవనాలకే పరిమితం కాకుండా, రైతులకు నిజమైన ప్రయోజనం చేకూర్చాలంటే తక్షణమే నిర్వహణ నిధులు విడుదల చేయాలని క్షేత్రస్థాయి అధికారులు కోరుతున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, నిరంతర ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తేనే ఈ వేదికల లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే ఉమ్మడి జిల్లాలోని వందలాది రైతు వేదికలు నిరుపయోగమైన కట్టడాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
కనీస సదుపాయాల్లేవు..
రైతు వేదికల వద్ద కనీస మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళా రైతులు, మహిళా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గత రెండేండ్లుగా విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో ఎప్పుడు కనెక్షన్ కట్ చేస్తారోనన్న ఆందోళన నెలకొంది. వాచ్‌మెన్లు లేకపోవడం కూడా నిర్వహణను మరింత కష్టతరం చేస్తోంది. ప్రస్తుతం సమావేశాల సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సేవలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
