- గ్రామాల్లో 150 సమస్యలను గుర్తించిన అధికారులు
- ప్రభుత్వానికి నివేదిక.. పనుల నిధుల కోసం ప్రతిపాదనలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఏటా వేసవిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. దీనికి తోడు మారుమూల ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందక.. చేతి పంపులు పనిచేయక తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాగునీటి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఏయే గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందో తెలుసుకునేందుకు అధికారులు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్, ఎంపీవో అధికారులు గ్రామీణా ప్రాంతాల్లో విస్త్రతంగా పర్యటించి తాగునీటికి సబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. ప్రతి హ్యాబిటేషన్లో గతేడాది ఎదురైన సమస్యను తెలుసుకొని, ఈఏడాది తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి కలెక్టర్కు అందజేశారు.
నివేదిక ప్రకారం నిధులు
అధికారులు కలెక్టర్కు అందజేసిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. గుర్తించిన సమస్యలకు అవసరమైన నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తారు. స్థానికంగా నీటి వనరులు, మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుందా లేదా.. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది.. చేతి పంపులు ఎన్ని ఉన్నాయి.. గ్రౌండ్ వాటర్ పరిస్థితి.. బావులు ఇలా పలు అంశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఇలా మొత్తం 1230 హ్యాబిటేషన్లలో నీటి ఎద్దడిపై స్పెషల్ డ్రైవ్ పూర్తిచేసిన అధికారులు మొత్తం 150 సమస్యలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లాలో 50కి పైగా చేతి పంపుల రిపేర్లు చేపట్టాల్సి ఉందని, పలు హ్యాబిటేషన్లలో నీటి సమస్య తీవ్రంగా తలెత్తే అవకాశాలున్నాయని గుర్తించారు. పైప్లైన్ లీకేజీ, సింగిల్ ఫేజ్ మోటర్ల సమస్య, చేదబావుల్లో నీటి వినియోగం వంటి అంశాలను నివేదికలో పొందుపర్చారు.
డ్రైవ్లో గుర్తించిన సమస్య.. దాని పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో మార్చి రెండో వారం నుంచి ఎండల తీవ్రత పెరిగి నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి వారంలోనే నిధులు విడుదల చేసి ఆయా హ్యాబిటేషన్లలో పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టనున్నారు.
తాగునీటి సమస్యపై నివేదిక సిద్ధం చేశాం
తాగునీటి సమస్యలపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తయారు చేశాం. మొత్తం 150 సమస్యలను గుర్తించాం. ప్రభుత్వానికి నివేదిక అందజేసిన తర్వాత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.- చంద్రమోహన్, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్
తాగునీటి సమస్య పరిష్కరించాలి
ప్రతి ఏడాది వేసవిలో మా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా అంతంత మాత్రమే. ఇప్పటికే గ్రామంలోని చేతి పంపులు పనిచేయడం లేదు. పరిస్థితి తీవ్రంకాక ముందే అధికారులు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి. - చందాపూరి గజానంద్, బోసర
