
- రెండేళ్లైనా నిర్ణయం తీసుకోవడంలేదు
- వార్డు పాలనపై మాత్రం గొప్పలు
- కమిటీల ఏర్పాటుకు గైడ్లైన్స్ ఇవ్వట్లేదు
- క్లారిటీ ఇవ్వని అధికారులు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేశామని రాష్ట్ర సర్కార్ గొప్పులు చెప్పుకుంటోంది. కానీ వార్డు కమిటీలను మాత్రం నియమించడంలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్ సైతం ఓ మీటింగ్ లో వార్డు కమిటీలపై మాట్లాడారు. అయినా.. నియామకానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం పాలనలో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. కౌన్సిల్ఏర్పడిన తర్వాత ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. బల్దియా ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా.. ఇంకా ఏర్పాటు చేయలేదు. 2019లో చట్ట సవరణ తర్వాత కనీసం రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎలాంటి ఆదేశాలను అధికారులు జారీ చేయడంలేదు. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాకపోగా అధికారులు కూడా క్లారిటీ ఇవ్వడంలేదు.
తక్షణ పరిష్కారానికి..
వార్డు కమిటీలు ఉంటే ఏ చిన్న సమస్యకైనా స్థానికంగానే తక్షణ పరిష్కారం లభించనుంది. కమిటీలను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. డివిజన్ కు కార్పొరేటర్ ఒక్కరే ఉండగా.. అదే వార్డు కమిటీకి 100 మందిని సభ్యులుగా ఎన్నుకోవాలి. కార్పొరేటర్ సమస్యలను పట్టించుకోకపోయినా తమ కాలనీల్లోని కమిటీ సభ్యులను ప్రజలు అడిగేందుకు అవకాశం ఉంటుంది. డివిజన్ అభివృద్ధికి సభ్యులు సలహాలు, సూచనలు ఇస్తుండాలి. ప్రజా సమస్యలపై సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలి. ఇక ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షించాలి. ప్రతినెల వార్డులోని పలు అంశాలపైనా చర్చించాలి.
అన్నివర్గాల వారు ఉండేలా..
గ్రేటర్‌లో 150 వార్డులున్నాయి. ఒక్కో వార్డు కమిటీలో100 మంది సభ్యుల చొప్పున 15 వేల మందిని ఎన్నుకోవాలి. కమిటీలో సీనియర్ సిటిజన్స్, మహిళలు, యూత్ ఇలా వివిధ వర్గాల వారు ఉండాలి. కానీ ప్రతిసారి నామమాత్రంగా 10 నుంచి 15 మందిని ఎన్నుకుంటున్నారు. దీంతో కమిటీల లక్ష్యం నెరవేరడంలేదు. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్, ఎలాంటి ఆదేశాలు లేక జీహెచ్ఎంసీ అధికారులు ఎదురుచూస్తున్నారు. సర్కారు నిర్ణయం రాకపోవడంతో ప్రక్రియ కూడా ముందుకు పడడంలేదు.
మూడునెలల్లోనే..
బల్దియాకు ఎన్నికలు జరిగిన మూడు నెలల్లోపు వార్డు కమిటీలను నియమించాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర అయిన అడుగు ముందుకు పడలేదు. వరదల కారణంగా అధికార పార్టీపై జనంలో వ్యతిరేకత వస్తుండడంతో కూడా వార్డు కమిటీలను నియమించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలతో పాటు డెవలప్ మెంట్పైనా ప్రశ్నిస్తారనే వార్డు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.