
- కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కారు
- ఐఆర్, ఈహెచ్ఎస్‌పైనా నిర్ణయాలు తీసుకునే చాన్స్
- ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్న కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండో పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. ఈ నెలఖారులో లేదంటే ఆగస్టులో రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వాస్తవానికి గత నెలలోనే మొదటి పీఆర్సీ గడువు ముగిసింది. 317 జీవో, టీచర్ల బదిలీలు, డీఏ వంటి విషయాల్లో సర్కార్‌పై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు మొదటి పీఆర్సీలో రావాల్సిన బెనిఫిట్స్ జీవోలను కూడా ప్రభుత్వం రెండేండ్లు ఆలస్యం చేసి ఇటీవల రిలీజ్ చేసింది.రెండో పీఆర్సీ ఏర్పాటు కూడా లేట్ చేయాలనే ఆలోచనలో సర్కారు ఉందని చర్చ జరిగింది. అయితే ఇప్పుడున్న తప్పని పరిస్థితుల్లోనే ప్రభుత్వం పీఆర్సీపై లీకులు ఇచ్చిందని సమాచారం.
2018లో తొలి పీఆర్సీ ఏర్పాటు
ఐదేండ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా జీతభత్యాల పెంపు జరగాల్సి ఉంటుంది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ స్టడీ చేసి.. ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుంది. దాన్ని బట్టి ప్రభుత్వం ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇస్తుంది. తొలుత 2015లో ఒకసారి ఉద్యోగులకు ప్రభుత్వం ఫిట్ మెంట్ ఇచ్చింది. అయితే అది ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్. 2013 నాటి పీఆర్‌సీ ప్రకారం 2015 ఏప్రిల్ లో సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2018 మే నెలలో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీఆర్ బిస్వాల్, ఉమామహేశ్వర రావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో పీఆర్‌సీ ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చాక ఇదే మొదటి పీఆర్సీ. ఈ పీఆర్సీ 2020 డిసెంబర్‌లో తన నివేదిక ఇచ్చింది. దీనికి 2021 మార్చిలో 30 శాతం ఫిట్ మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండో పీఆర్సీని త్వరలో ఏర్పాటు చేయనుంది. అయితే ఈసారి నవంబర్, డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉన్నందున ఆలోపే ఫిట్‌మెంట్‌ను లీక్ చేస్తారా? లేక ఎన్నికల హామీల్లో భాగంగా మళ్లీ అధికారంలోకి వస్తే ఎంత ఇస్తారనేది ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఉద్యోగుల వ్యతిరేక ఓట్లను అనుకూలంగా మార్చుకునేలా సర్కారు ప్లాన్ చేస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
ఐఆర్, హెల్త్ స్కీమ్‌పైనా నిర్ణయం!
ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు మధ్యంతర భృతి (ఐఆర్)ని కూడా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. అయితే నిధుల సర్దుబాటును బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీం(ఈహెచ్‌ఎస్)పైనా నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందుకోసం వారం, 10 రోజుల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని సీఎంఓ వర్గాలు పేర్కొంటున్నాయి.