పార్కుల పేరుతో ప్రభుత్వ దందా.. LRSతో ఖజానా నింపుకోవడమే టార్గెట్

పార్కుల పేరుతో ప్రభుత్వ దందా.. LRSతో ఖజానా నింపుకోవడమే టార్గెట్
  •     వెంచర్​లో పార్కు స్థలం లేకపోతే 14 శాతం ఫైన్
  •     ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు అదనంగా వసూలు
  •     ఫైన్ కట్టినా పార్కు రాదు.. సర్కారు నిర్మించదు
  •     ప్లాట్లకు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు ఇల్లీగల్ అంటున్నరు
  •     రియల్టర్ల మోసాలకు తమను బలిపశువులను చేస్తున్నారంటున్న జనం

హైదరాబాద్, వెలుగుఎల్ఆర్ఎస్ లో పార్కుల పేరుతో ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. పార్కులు లేని వెంచర్ లో ప్లాట్ కొన్న వారికి ఏకంగా 14 శాతం ఫైన్ విధించనుంది. ఎల్ఆర్ఎస్ ఫీజుకు అదనంగా ఈ జరిమానా కట్టాల్సి వస్తోంది. రియల్టర్లు చేసిన మోసాలకు మమ్మల్ని బలిపశువులను చేస్తారా అంటూ ప్లాట్లు కొన్నవాళ్లు వాపోతున్నారు. ప్లాట్ కొనే సమయంలో ఖాళీ జాగా ఉంచుతామని చెప్పారని, తర్వాత వాటినీ ప్లాట్లుగా చేశారని చెబుతున్నారు. తమను మోసం చేసిన వాళ్ల నుంచి ఫైన్ వసూలు చేయాలని కానీ, తమను బాధ్యులను చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

లే అవుట్ రెగ్యూలరైజేషన్ స్కీం కింద ప్రభుత్వం సెప్టెంబర్ 7 నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. ఈనెల 15 వరకు గడువు ఉంది. అప్లై చేసుకున్న వ్యక్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు ఫైన్ కడితినే వారి ప్లాట్స్ రెగ్యూలరైజ్ అయినట్టు లెక్క. లేకపోతే ఆ ప్లాట్స్ ను భవిష్యత్ లో ఎవరికి విక్రయించే చాన్స్ ఉండదు. ఇలా ఎల్ఆర్ఎస్ కింద ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో 60 శాతం ఫీజు అంటే రూ.6 వేల కోట్ల ఆదాయం పార్కులు లేని లేఅవుట్ల నుంచి ప్రభుత్వానికి ఫైన్ రూపంలో రానుంది. ఇప్పటివరకు 10,4870 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 80 శాతం అప్లికేషన్లు వ్యక్తిగతంగా అప్లై చేసుకున్న వారి నుంచే ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.

ఫైన్ కట్టించుకుని.. పార్కులు నిర్మించే చాన్స్ లేదు

పార్కులు లేని వెంచర్ లో ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి ప్లాట్ విలువపై 14 శాతం అదనంగా ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే జరిమానా వేస్తున్న సర్కారు.. సదరు వెంచర్లలో పార్కు నిర్మించే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ వెంచర్ లో పార్కులు నిర్మించడానికి ఖాళీ స్థలం ఉండదు. రోడ్లు మినహా ఎక్కడా ఖాళీ స్థలం వదలకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ మొత్తాన్ని ప్లాటింగ్ చేసి అమ్మేశారు. మరి ఇప్పుడు పార్కుల పేరుతో వసూలు చేసిన సొమ్ముతో ఏం చేస్తుందనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా సమాధానం లేదు. కేవలం అక్రమ లే అవుట్స్ లో ప్లాట్ కొన్నందుకు పరిహారం చెల్లించాలని చెప్తోంది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం వెంచర్ లో ప్లాటింగ్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ రోడ్స్ నిర్మించడంతో పాటు 10 శాతం స్థలాన్ని ఖాళీగా ఉంచాలి. అ స్థలంలో పార్కు, ఇతర కమ్యూనిటీ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ను రియల్టర్లు పట్టించుకోలేదు. రూల్స్ పట్టించుకోకుండా ఖాళీ స్థలాన్ని కూడా ప్లాటింగ్ చేసి అమ్ముకున్నారు.

అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి..

రియట్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్స్ చేసి, అమ్ముతున్నప్పుడు ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టలేదు. హెచ్ఎండీఏ అనుమతితోనే ప్లాటింగ్ చేస్తున్నారా? ఇష్టానుసారంగా ప్లాటింగ్ చేశారా? ఓపెన్ ప్లేస్ వదలేశారా? అనే దాన్ని చూడలేదు. వెంచర్ లోని ప్లాట్స్ ను విక్రయించేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ చేశారు. ప్రజలు ప్లాట్స్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తీరా కొనుకున్న తర్వాత ఇప్పుడు అక్రమ లే అవుట్స్ అంటూ సర్కారు ఫైన్ వసూలు చేస్తోంది.

ప్లాట్లు కొన్నోళ్లదే తప్పంట

ప్లాట్ కొన్న వారిదే తప్పని ప్రభుత్వం వాదిస్తోంది. ఓ ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు దానికి అన్ని అనుమతులు ఉన్నాయా? లేవా? అని చూడకుండా ఎలా కొంటారని ప్రశ్నిస్తోంది. అక్రమ లే అవుట్లలో ప్లాట్ కొనుగోలు చేసి, ఫైన్ కట్టలేమని చెబితే ఎలా అంటోంది. కొన్న ప్లాట్ ను ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ఫైన్ కట్టాలని స్పష్టం చేస్తోంది.

వసూలు ఇలా..

200 చదరపు గజాల ప్లాట్..167 చదరపు మీటర్ల కింద లెక్క. ప్రభుత్వ జీవో ప్రకారం 100 నుంచి 300 చదరపు మీటర్ల వరకు రూ.400 చొప్పున చార్జీలను లెక్కిస్తారు. అంటే 167 చదరపు మీటర్లకు రూ.400 చొప్పున లెక్కిస్తే రూ.66,800 అవుతుంది. సదరు ప్లాట్ లో మార్కెట్‌‌ విలువ చదరపు మీటర్ కు రూ.3 వేలుగా ఉంటే.. జీవో ప్రకారం రూ.3 వేల వరకు 20 శాతం శ్లాబులోకి వస్తుంది. ఈ క్రమంలో రూ.66,800 మొత్తంలో 20 శాతం అంటే రూ.13,360ని రెగ్యులరైజేషన్ చార్జీగా నిర్ధారిస్తారు. దీంతోపాటు లేఅవుట్‌‌ మొత్తం విస్తీర్ణంలో పది శాతం ఓపెన్‌‌ స్పేస్‌‌ లేకుంటే ఓపెన్‌‌ స్పేస్‌‌ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ప్లాటు విలువ ఆధారంగా లెక్కిస్తారు. 200 గజాల ప్లాటు విలువ రిజిస్ట్రేషన్ సమయంలో సేల్ డీడ్ ప్రకారం రూ.3 లక్షలు ఉందనుకుంటే అందులో 14 శాతం వసూలు చేస్తారు. అంటే రూ.42 వేలు ఓపెన్ స్పేస్ చార్జీలుగా నిర్ధారిస్తారు. ఈ ప్రకారం రెగ్యులరైజేషన్ చార్జీల రూ.13,360, ఓపెన్ స్పేస్ చార్జీలు రూ.42 వేలు కలిపితే రూ.55,360 చెల్లించాల్సి ఉంటుంది.

– రమేశ్ – శ్రీధర్, హైదరాబాద్