లిక్కర్ పై ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కారు యత్నం

లిక్కర్ పై ఆమ్దానీ పెంచుకునేందుకు సర్కారు యత్నం
  • ఆఫీసర్లకు ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారుల వేధింపులు
  • జూన్‌‌‌‌లో రూ.3,020 కోట్ల మద్యం సేల్స్‌‌‌‌.. ఇంకింత కావాలంటూ ఒత్తిడి
  • అమ్మకాలు తక్కువుంటే వివిధ కారణాలతో చర్యలు
  • దీంతో వైన్స్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌ తీసుకొస్తున్న కిందిస్థాయి ఆఫీసర్లు
  • అమ్మకాలు తగ్గిన వైన్స్‌‌‌‌ ఓనర్లకు నోటీసులిచ్చేందుకు రెడీ?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లిక్కర్‌‌‌‌ ద్వారా ఎంత ఆదాయం సమకూరినా రాష్ట్ర ఆబ్కారీ శాఖకు సరిపోవడంలేదు. ప్రతి నెల ఆమ్దానీ పెరుగుతున్నా ఇంకా ఎక్కువ రావాలని ఎక్సైజ్‌‌‌‌ శాఖ ఉన్నతాధికారులు పట్టుబడుతున్నారు. మద్యం అమ్మకాలు మరింత పెంచాలని స్టాఫ్‌‌‌‌, ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వీరంతా వైన్స్‌‌‌‌పై ప్రెజర్‌‌‌‌ తీసుకొస్తున్నారు. సేల్స్‌‌‌‌ తగ్గడంపై కొన్ని చోట్ల ఏకంగా వైన్స్‌‌‌‌ యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

రూ.678 కోట్ల అదనపు అమ్మకాలు.. అయినా..

రాష్ట్రంలో 2,620 మద్యం షాపులతోపాటు బార్లు, క్లబ్‌‌‌‌లు, పబ్‌‌‌‌లు ఉన్నాయి. వీటికి ఆయా జిల్లాల్లో ఉన్న మద్యం డిపోల నుంచి సరుకు సరఫరా అవుతుంది. జూన్‌‌‌‌ నెలలో రూ.3,020 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 49 లక్షల కార్టన్ల బీర్లు, 29 లక్షల కార్టన్ల ఐఎంఎల్‌‌‌‌ ఉంది. గతేడాది జూన్‌‌‌‌లో 2,342 కోట్ల లిక్కర్‌‌‌‌ మాత్రమే అమ్ముడైంది. ఇందులో 28 లక్షల కార్టన్ల ఐఎంఎల్‌‌‌‌, 26 లక్షల కార్టన్ల బీర్లు ఉన్నాయి. గతేడాది కంటే ఈ సారి రూ.678 కోట్ల మద్యం అదనంగా సేల్‌‌‌‌ అయ్యింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,790 కోట్ల లిక్కర్‌‌‌‌ అమ్మారు. ఇంతలా సేల్స్ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం సంతృప్తి చెందడంలేదు. గతేడాది కంటే ప్రస్తుత నెలలో ఒక్క కార్టన్‌‌‌‌ కూడా తక్కువ కాకుండా అమ్మకాలు జరగాలని కిందిస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. అంత కంటే తక్కువగా అమ్మితే ఇక వేధింపులు తప్పవు. వివిధ కారణాలు చెబుతూ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కిందిస్థాయి ఆఫీసర్లు కూడా ఫుల్లుగా తాగించాలని, సేల్స్‌‌‌‌ పెంచాలని వైన్స్‌‌‌‌, బార్ల యజమానులపై ఒత్తిడి పెంచారు. మద్యం అమ్ముడుపోవడానికి బెల్ట్‌‌‌‌ షాపులను కూడా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు చర్యలు

అక్రమ మద్యం రవాణాపై ఆబ్కారీ శాఖ యాక్షన్ ప్లాన్‌‌‌‌ రూపొందించింది. రెండు రోజుల కిందట సర్క్యులర్‌‌‌‌ కూడా జారీ చేసింది. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో స్పెషల్‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌ పెట్టాలని అందులో ఆదేశించింది. జిల్లాల్లో టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్లు తెలిసేలా పబ్లిసిటీ చేయాలని.. ఎస్‌‌‌‌ఐలు ఎప్పటికప్పుడు తమ 
స్టేషన్‌‌‌‌ పరిధిలో తిరుగుతూ అలెర్ట్‌‌‌‌గా ఉండాలని. స్టేట్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ జిల్లాల్లో పర్యటించాలని అందులో పేర్కొంది. ఇంటెలిజెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లు ఏర్పాటు చేయాలని, చెక్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లు ఇంకా టైట్‌‌‌‌ చేయాలని సూచించింది.

వైన్స్‌‌‌‌ యజమానులకు నోటీసులు?

వైన్స్‌‌‌‌ యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఏయే వైన్స్‌‌‌‌లో సేల్స్‌‌‌‌ తగ్గాయో ఇప్పటికే అధికారులు లెక్కలు తీశారు. అమ్మకాలు తగ్గడానికి కారణాలు విశ్లేషిస్తున్నారు. నాన్‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌, నకలీ మద్యం, గుడుంబా, గంజాయి పెరిగిందా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తరలివస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లిక్కర్‌‌‌‌ రేట్లు భారీగా పెరగడంతోనే నాన్‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌ ఏరులై పారుతోంది. గతంలో ఏపీలో రేట్లు భారీగా పెరిగినప్పుడు.. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం భారీగా తరలిన విషయం తెలిసిందే.