- లక్ష ప్రసవాలకు మాతృ మరణాలు 43 మాత్రమే.. జాతీయ సగటు 88
- శిశు మరణాల రేటు 21 నుంచి 18కి డౌన్
- 99.9 శాతం ప్రసవాలు హాస్పిటల్స్‌లోనే..
- సోషియో ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గర్భిణులు, పసిబిడ్డల ప్రాణాలు కాపాడటంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే-2026 రిపోర్టు ప్రకారం.. అన్ని కీలక ఆరోగ్య సూచికల్లో తెలంగాణ జాతీయ సగటును మించి దూసుకుపోతున్నది. క్షేత్రస్థాయిలో పెరిగిన మౌలిక సదుపాయాలు, నిరంతర పర్యవేక్షణ కారణంగా రాష్ట్రంలో మాతృ, శిశు ఆరోగ్యం మరింత మెరుగైంది. ఫలితంగా మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు రిపోర్టు పేర్కొన్నది.
దేశ సగటు కంటే అన్నింట్లోనూ బెటర్
జాతీయ ఆరోగ్య గణాంకాలతో పోలిస్తే రాష్ట్ర పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నట్లు రిపోర్టు స్పష్టం చేస్తోంది. దేశంలో ప్రతి లక్ష ప్రసవాలకు మాతృ మరణాల సంఖ్య 88గా ఉంటే.. అదే మన రాష్ట్రంలో ఆ సంఖ్య కేవలం 43 మాత్రమే. అంటే దేశ సగటు కంటే మన దగ్గర మరణాలు సగం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి జననాలకు 25 మంది శిశువులు మరణిస్తుంటే, మన రాష్ట్రంలో ఆ సంఖ్య 18కే పరిమితమైంది.
అలాగే, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటులో జాతీయ సగటు 29 ఉండగా, తెలంగాణలో అది 22 మాత్రమే. నవజాత శిశు మరణాలు రేటులో దేశ సగటు 19గా ఉండగా మన రాష్ట్రం 14కు తగ్గించగలిగింది.
ఒక్క ఏడాదిలో మార్పు
2025 లెక్కలతో పోలిస్తే.. 2026లో రాష్ట్రంలో అన్ని ఆరోగ్య సూచికల్లో సానుకూల మార్పులు వచ్చాయి. శిశు మరణాలు 2025 సర్వేలో 21 ఉండగా, 2026 నాటికి 18కి తగ్గింది. నవజాత శిశు మరణాలు 15 నుంచి 14కు, ఐదేళ్లలోపు మరణాలు 23 నుంచి 22కు తగ్గింది. ఇనిస్టిట్యూషనల్ (ఆస్పత్రి) డెలివరీలు 2025లో 97 శాతంగా ఉండగా, 2026 నాటికి అది ఏకంగా 99.9 శాతానికి చేరుకుంది.
అంతా దవాఖానల్లోనే..
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వద్దే ప్రసవాలు జరిగి తల్లీబిడ్డల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతున్నది. 99.9 శాతం ప్రసవాలు హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నట్లు రిపోర్టు స్పష్టం చేసింది. గవర్నమెంట్లో 50 శాతం, ప్రైవేట్ లో 49.9 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి.
గర్భిణులు మొదటి మూడు నెలల్లోనే 97.5 శాతం మంది పేర్లు నమోదు చేసుకోవడం, కనీసం 94 శాతం మంది నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో మరణాలను అరికట్టడం సాధ్యమైందని రిపోర్టు పేర్కొన్నది.
విజన్ 2047 లక్ష్యంగా..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ -విజన్ 2047లో భాగంగా మాతృ మరణాలను 6 కంటే తక్కువకు, శిశు మరణాలను 7 కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చును రాష్ట్ర జీఎస్డీపీలో ప్రస్తుతమున్న దానికంటే 8 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అలాగే మాతృ, శిశు మరణాల తగ్గింపునకు చర్యలు తీసుకోవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమైనట్లు రిపోర్టు పేర్కొన్నది.
అమ్మఒడి 102 సర్వీస్ ద్వారా 300 ప్రత్యేక వాహనాల ద్వారా 7.90 లక్షల మంది గర్భిణులకు ఉచిత రవాణా అందిస్తున్నట్లు, మహిళల ఆరోగ్య సమస్యల కోసం 372 సెంటర్లలో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నది. టీ-డయా గ్నోస్టిక్స్ పేరుతో 31 జిల్లా హబ్ ల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చినట్లు రిపోర్టు స్పష్టం చేసింది.
