గిరిజన వర్సిటీకి జాగ ఇవ్వడంలో రాష్ట్రం లేట్​ చేసింది

గిరిజన వర్సిటీకి జాగ ఇవ్వడంలో రాష్ట్రం లేట్​ చేసింది
  • ఎంపీ ఉత్తమ్​ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు:  ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి అప్పగించడంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విభజన చట్టం ప్రకారం...  తెలంగాణ లో ట్రైబల్ యూనివర్సిటీ, ఏపీలో సెంట్రల్ అండ్ ట్రైబల్ యూని వర్సిటీల ఏర్పాటు ప్రక్రియను ఒకే సారి ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ట్రైబల్ యూనివర్సిటీ కోసం స్థలం ఇవ్వడంలో ఆలస్యం చేసిందని స్పష్టం చేసింది. ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్  సోమవారం లోక్​సభలో సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాలో సూచించిన స్థలాన్ని మానవ వనరుల శాఖకు చెందిన సైట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిందని ఆయన పేర్కొన్నారు. డీపీఆర్‌‌‌‌ సిద్ధమైందని, ఇంటర్ మినిస్టీరియల్ సంప్రదింపులు కూడా పూర్తయ్యాయన్నారు. తదుపరి అనుమతుల కోసం ఆర్థిక  శాఖ ఆమోదానికి పంపినట్లు వివరించారు. ఇదే అంశంపై ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఎంపీ ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ట్రైబల్ వర్సిటీ ఏర్పాటులో జాప్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమన్నారు.  సరైన టైంలో ధాన్యం కొనక పోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
ఉత్తమ్​ ప్రెస్​మీట్​.. టీఆర్​ఎస్​ స్లోగన్స్​
ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్, టీఆర్ఎస్ ఎంపీల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకవైపు ఉత్తమ్.. రాష్ట్రంలో వడ్ల  కొనుగోళ్లపై మీడియాతో మాట్లాడుతుంటే, పక్కనే టీఆర్ఎస్ ఎంపీలు ఇదే అంశంపై ప్లకార్డ్స్ తో స్లోగన్స్ చేశారు. ఉత్తమ్ ప్రెస్ మీట్ లో స్పందిస్తూ..  వడ్లు కొనాలని రైతులు అడుగుతుంటే, ఢిల్లీ తెలంగాణ భవన్ లో స్లోగన్స్  చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావుతో ఇదే అంశాన్ని ఉత్తమ్​ ప్రస్తావించగా నవ్వుతూ వెళ్లిపోయారు.