చట్టబద్ద హక్కులు సాధించేవరకు సమ్మె విరమించేది లేదు

చట్టబద్ద హక్కులు సాధించేవరకు సమ్మె విరమించేది లేదు

మందమర్రి/నస్పూర్/ బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి కాంట్రాక్టర్ల -డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపులో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి రీజియన్​లో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్​, రామకృష్ణాపూర్​ ప్రాంతాల్లో 24 డిపార్ట్​మెంట్లకు చెందిన 8వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి వేర్వేరుగా ధర్నాలు, ర్యాలీలు తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్​ కార్మిక సంఘం జేఏసీ లీడర్లు మాట్లాడుతూ..  ప్రస్తుత పరిస్థితుల్లో 90 శాతం వేతనాలు పెంచాలని, పర్మినెంటు కార్మికులతో సమానంగా లాభాల్లో వాటా, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, తదితర చట్టబద్ద హక్కులు సాధించేవరకు సమ్మె విరమించేది లేదన్నారు. శ్రీరాంపూర్​ ఏరియాలో షిర్కే నుంచి తెలంగాణ తల్లి విగ్రహం, ప్రెస్​క్లబ్​ వరకు ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణాపూర్​లోని సింగరేణి సివిల్​ ఆఫీస్​ నుంచి వారాంతపు సంతలోని అంబేద్కర్​విగ్రహం వరకు, మందమర్రిలోని సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​ నుంచి అంబేద్కర్​ విగ్రహం వరకు ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందించారు.  జేఏసీ లీడర్లు టి.శ్రీనివాస్​, రామగిరి రామస్వామి, సంకె రవి, డి.బ్రహ్మనందం, దూలం శ్రీనివాస్​, ఎండీ.జఫర్​ పాల్గొన్నారు. 

బెల్లంపల్లిలో..

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల సాధన కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లిలో సింగరేణి సివిక్ ఆఫీస్ ముందు సింగరేణి యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఎండీ.చాంద్ పాషా, టి. మనిరామ్ సింగ్, ఎ. మహేందర్ లు మాట్లాడారు.  కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు నారాయణ, కృష్ణవేణి పా ల్గొన్నారు.