పురుగుల అన్నం పెడుతుండ్రని స్టూడెంట్స్ ధర్నా

పురుగుల అన్నం పెడుతుండ్రని స్టూడెంట్స్ ధర్నా

ఖమ్మం: అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలుర) విద్యార్థులు నిరసనకు దిగారు. రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు ఫిర్యాదు చేసేందుకు కాలినడకన బయలు దేరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ డి. పుల్లయ్య, ఎస్ఐ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో చర్చిస్తున్నారు.

తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

కొన్ని రోజులుగా తమకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు తహసీల్దార్ పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. అన్నం విషయమై ప్రిన్సిపాల్ కు చెప్పగా... ఆయన ఇష్టమొచ్చినట్లు తిట్టారని వాపోయారు. తమ ఇండ్లల్లో ఇంతకంటే మంచి భోజనం దొరుకుతుందా అంటూ ప్రిన్సిపాల్  అవమానించాని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు. హాస్టల్ కు ప్రహారీ గోడ లేకపోవడంతో పందులు, కుక్కలు ఇతర జంతువులు పాఠశాల ఆవరణలోకి వచ్చి ఆగమాగం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో ఇతర అధికారులు హాస్టల్ విద్యార్థులకు నచ్చజెప్పుతున్నారు.