
రాజపుతానాలోని ప్రధాన సంస్థానాల్లో ఒకటైన బికనీరుకు 21వ పాలకుడు మహారాజా గంగా సింహ్( సింగ్) జీ.1880లో పుట్టిన ఈయన ఏడేండ్ల వయసులో తన అన్న దుంగర్ సింగ్ స్థానంలో సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన అజ్మీర్‌లోని మేయో కాలేజీలో చదివాడు. అయితే చిన్న వయసులోనే ప్రభుత్వ బాధ్యతలు మీద ఉండడంతో ఆయనకు శిక్షణ ఇవ్వవలసిందిగా ఆంగ్ల అధికారి సర్ బ్రియాన్ ఈగర్టన్కు అప్పగించారు.
ఆయనే అతనికి సంరక్షకుడు, శిక్షకుడు. 1898లో దేవ్లీ దగ్గర గంగా సింగ్ మిలిటరీ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈయన 18వ ఏట బికనీరు పరిపాలకునిగా అధికారాలను చేపట్టాడు. అయితే అదే సమయంలో వర్షాలు లేక సంస్థానం కరువుతో అల్లకల్లోలమైంది. దాంతో తనను తానే కరువు నివారణాధికారిగా ప్రకటించుకుని సంస్థానమంతటా నివారణ చర్యలు చేపట్టాడు. కలరా వచ్చినప్పుడు కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించాడు.
ఈయన మానవత్వాన్ని చూసి లార్డ్ కర్జన్ ‘కైసర్ – ఇ – హింద్’ బంగారు పతకాన్ని ప్రదానం చేశాడు. 1901లో లెగేషన్ మీద దాడి వల్ల ఇండియా నుంచి చైనాకు దళాలను పంపేవారు. ఆ టైంలో మహారాజా అందరికంటే ముందే తన సేవలను అందించేందుకు సిద్ధమయ్యాడు. సామ్రాజ్యం కోసం విదేశాలకు సైనిక విధులకు వెళ్లిన మొదటి మహారాజు ఈయన. చైనా నుంచి తిరిగి రాగానే కలకత్తాలో ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత సంస్థాన పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ముందుగా పరిపాలనా యంత్రాంగాన్ని సరిచేయాలనుకున్నాడు.
ఆధునిక పరిపాలనా వ్యవహారాల్లో సహకారం అందించడానికి సెక్రటేరియట్‌ను స్థాపించడానికి, దేశ శాంతిభద్రతలు, చట్టాన్ని ప్రవేశ పెట్టడానికి, కొత్త పంటలతో వ్యవసాయాన్ని డెవలప్ చేయడానికి పూనుకున్నాడు. బికనీరుతో అనుసంధానం అయ్యేలా రైల్వే విధానాన్ని తీసుకొచ్చాడు. 1912 నాటికి బికనీర్ ఆధునిక, అభివృద్ధి చెందిన ప్రముఖ రాజ్యాల్లో ఒకటిగా నిలిచింది. ఆదాయం రెండింతలయింది. సంస్థాన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘విధాన సభ’ ఏర్పాటు గురించి ప్రకటించారు.
ఉత్తర భారతంలో ప్రతినిధి సంస్థలను ప్రవేశ పెట్టిన తొలి రాజు ఆయనే. 1914లో ప్రపంచ యుద్ధం ప్రకటించినప్పుడు తన దగ్గర ఉన్న వనరులన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాడు. అంతేకాకుండా తన సేవలను బికనీర్ సైన్యంతో సహా బ్రిటిష్ సామ్రాజ్యానికి అందించడానికి రెడీ అయ్యాడు. మొదటిసారి భారత రాజుల అధికారిక సమావేశం 1916లో జరగడానికి కారణం గంగా సింగ్. మహారాజాను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోగా ఐదేండ్లు ఆ పదవిలో సేవలందించాడు.
తర్వాత ‘చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్’కు మొదటి చాన్స్‌లర్ అయ్యాడు. బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకున్నా ఆయా సంస్థానాల భూములను ఆయన చర్చల ద్వారా తిరిగి ఇప్పించాడు. తోటి రాజుల కోసం పదేండ్లు పాటుపడిన మహారాజా మళ్లీ చాన్స్‌లర్ అయ్యేందుకు ఒప్పుకోలేదు. తన రాజ్యం మీద ఫోకస్ చేశాడు. కొత్తగా నీటి వసతి కల్పించే విషయంలో మహారాజు చొరవతో 1927లో లార్డ్ ఇర్విన్ గంగా కాలువ స్లూయిస్ గేట్లను తెరిచాడు. దాంతో మహారాజా చిరకాల వాంఛ నెరవేరింది.
1930లో లీగ్ ఆఫ్ నేషన్స్‌కు ఇండియన్ డెలిగేషన్కు నేతృత్వం వహించాలని మహారాజును ఆహ్వానించారు. ఆ గౌరవం దక్కిన మొదటి రాజు ఈయన. 1937లో బికనీర్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు దేశ నలుమూలల నుంచి రాజులు, ప్రజానేతలు, ఇంగ్లాండ్ నుంచి స్నేహితులు ఎంతోమంది వచ్చారు. 56 ఏండ్లు పరిపాలించిన మహారాజా 1943లో 62వ ఏట మరణించాడు.