సర్కారు వేయమన్న పంటలకు మద్దతు దక్కుతలే

సర్కారు వేయమన్న పంటలకు మద్దతు దక్కుతలే

(వెలుగు, నెట్​వర్క్​) యాసంగిలో వడ్లు వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయండి..’ అంటూ ప్రచారం చేసిన రాష్ట్ర సర్కారు, తీరా పంటలు పండాక వాటి మార్కెటింగ్​ గురించి పట్టించుకోవడం లేదు. ఆయా పంటల కొనుగోలుకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో మద్దతు ధర దక్కట్లేదు. పంట మార్కెట్​కు రాగానే వ్యాపారులు సిండికేట్​గా మారి రేట్లు తగ్గిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. వానాకాలం కంది ఇంకా వస్తున్నా మార్క్​ఫెడ్ కొనుగోళ్లు బంద్​పెట్టడంతో బయట రేటు రావడం లేదు. ఇక ​యాసంగిలో వేసిన పల్లి నెలరోజుల నుంచి మార్కెట్​కు వస్తున్నా ట్రేడర్ల మాయాజాలం వల్ల అన్నదాతలు నిండా మునుగుతున్నారు.  మరోవైపు సర్కారు వద్దన్న మక్కకే మంచి ధర వస్తోంది. సాధారణంగా మక్కలకు గతంలో ఎన్నడూ క్వింటాల్​రూ. 1,800 దాటలేదు. అలాంటిది ఇప్పుడు రూ. 2,200 నుంచి 2,400 వరకు పలుకుతుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలు అంతంతే.. 

రాష్ట్ర సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ రైతులు ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపలేదు. విత్తనాల కొరత, కోతుల బెడదకు తోడు మార్కెటింగ్​ సౌకర్యంపై ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదు. దీంతో చాలామంది మిల్లర్లతో ఒప్పందాలు చేసుకొని వరి పండించారు. యాసంగిలో 54 లక్షల 41వేల 985 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేయగా, అత్యధికంగా  35లక్షల84వేల187 ఎకరాల్లో వరి(65శాతానికి పైగా) వేశారు. మిగిలిన పంటలన్నీ 35శాతానికే పరిమితమయ్యాయి. వరి తర్వాత 5 లక్షల 36వేల449 ఎకరాల్లో మక్క,  3 లక్షల 82 వేల 711 ఎకరాల్లో పప్పుశనగ, 3లక్షల57వేల211 ఎకరాల్లో పల్లి, లక్షా25 వేల 809 ఎకరాల్లో జొన్న, 77,869 ఎకరాల్లో నువ్వులు, 43,258 ఎకరాల్లో పొద్దుతిరుగుడు,  38,175 ఎకరాల్లో పెసర, 5,622 ఎకరాల్లో కంది సాగుచేశారు. 

వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుంటున్నరు.. 

గతేడాది ఖరీఫ్​ సీజన్​లో 7.7 లక్షల ఎకరాల్లో కంది సాగవగా, 4.67 లక్షల మెట్రిక్​ టన్నుల ప్రొడక్షన్​ వస్తుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం 80,142 మెట్రిక్​ టన్నుల సేకరణకు ముందుకు రాగా, మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో  103 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 50కు పైగా సెంటర్లు ఏర్పాటుచేసినప్పటికీ తేమ, పొల్లు పేరిట కొర్రీలు పెట్టడంతో రైతులు బయట వ్యాపారులకే అమ్ముకున్నారు.  సిద్దిపేట జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో కంది సాగయితే 50 వేల క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ  కేవలం 2వేల క్వింటాళ్ల లోపే కొన్నారు. దీంతో ఈసారి కందులకు 6,300 మద్దతు ధర ఉన్నా బయట వ్యాపారులకు రూ.5వేల నుంచి 5,500 వరకే అమ్ముకుంటున్నారు. జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో  ఈ ఏడాది ఫిబ్రవరిలో కందుల కోనుగోలు సెంటర్ ను ప్రారంభించిన ఆఫీసర్లు కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే కొని, సెంటర్​ ఎత్తేశారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు క్రమక్రమంగా రేటు తగ్గిస్తూ, ఫిబ్రవరి చివరి కల్లా క్వింటాల్​కు రూ.4వేల నుంచి 5,500కు తెచ్చారు. తాజాగా 3,500 నుంచి 4,500 మాత్రమే చెల్లిస్తున్నారు. మరో 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా యాసంగి కంది మార్కెట్​లోకి వచ్చే చాన్స్​ ఉండగా, రేట్లను మరెంత దిగజారుస్తారేమోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అలాగే సన్​ఫ్లవర్​కు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.6015 రాష్ట్రంలో ఎక్కడా దక్కడం లేదు. సిద్దిపేట లాంటి మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్​గా మారి రూ.5000 నుంచి రూ.5,500 మాత్రమే చెల్లిస్తున్నారు. పల్లి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఉమ్మడి మహబూబ్​నగర్​ పల్లి సాగుకు పెట్టింది పేరు. ఈ యాసంగిలో ఇక్కడి ఐదు జిల్లాల్లోని 2,60,322 ఎకరాల్లో పల్లి సాగైంది. సుమారు 2 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వచ్చింది. కేంద్రం మద్దతు ధర 5,550 ఉండగా  మార్కెట్​లోకి దిగుబడి రాకముందు ఓపెన్​ మార్కెట్​లో రూ.7600 వరకు పలికింది. ఫిబ్రవరి నుంచి పంట రావడం మొదలయ్యాక  ట్రేడర్లంతా ఏకమై రేటు తగ్గిస్తూ వచ్చారు. ఫలితంగా మొదట్లో రూ.6,060  పలికిన ధర ఇప్పుడు రూ.4వేలకు, ఒకదశలో రూ.3,200 కు చేరింది. చాలా మార్కెట్ కమిటీల్లో వ్యాపారులంతా ఆఫీసుల్లోనే మీటింగులు పెట్టి  ఫలానా కుప్పకు ఇంతకు మించి రూపాయి కూడా ఎక్కువ పాడే ప్రసక్తి లేదని మొండికేస్తున్నారు. దీంతో రైతులు అగ్గువకు అమ్ముకొని లాస్​అవుతున్నారు. 

 వద్దన్న మక్కలే నయమున్నయ్​.. 

ఈ యాసంగిలోనూ ఎట్టి పరిస్థితుల్లో రైతులు మక్కలు వేయవద్దని  రాష్ట్ర సర్కారు చెప్పింది. కానీ వరి తర్వాత అత్యధికంగా ఈ సీజన్​లో రైతులు 5 లక్షల 36 వేల 449 ఎకరాల్లో మక్క సాగుచేశారు. సర్కారు మాటను ఖాతరు చేయకుండా మక్క వేసిన రైతుల పరిస్థితే ఇప్పుడు మెరుగైంది.  సాధారణంగా మక్కలకు ఎప్పుడూ క్వింటాల్​రూ. 1,800 రేటు దాటేది కాదు. కానీ ప్రస్తుతం రూ. 2,200 నుంచి 2,400 వరకు పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుతో గత యాసంగి, వానకాలం రైతులు మక్క సాగు తగ్గించడం,  కత్తెర పురుగు దాడి, అకాలవర్షాలతో దిగుబడులు తగ్గాయి. దీంతో వ్యాపారుల దగ్గర, గోదాముల్లో నిల్వలు లేకుండా పోయాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫారాలకు దాణా సప్లై చేసే కంపెనీలకు మక్కల అవసరం పెరిగింది. దీనికితోడు లోకల్ గా ఉన్న బిస్కట్ కంపెనీలతోపాటు వైజాగ్ పోర్ట్ నుంచి ఇతర దేశాలకు మక్కలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో మక్కలకు డిమాండ్​ పెరిగింది. అందుకే  మద్దతు ధరని మించి  రేటు పెడుతున్నారు. కరీంనగర్​జిల్లాలోని చొప్పదండి, జమ్మికుంట మార్కెట్లలో వారం రోజులుగా మక్కలు క్వింటాల్​కు రూ. 2,200 నుంచి రూ. 2,400 మధ్య  పలుకుతున్నాయి.

పల్లి వేస్తే వ్యాపారులు ముంచిన్రు

నిరుడు పల్లికి రూ.7,700 రేట్ వచ్చింది. ఈసారి కూడా అట్లనే ఉంటదని యాసంగిలో ఆరు ఎకరాల్లో పల్లి వేసిన. 180 బస్తాల దిగుబడి వచ్చింది. రెండు వారాల కింద పంటను అమ్మనీకి పాలమూరు మార్కెట్​కు తీస్కచ్చిన. ఉదయం కమిషన్ ఏజెంట్లు వచ్చి బుడ్డలను పరిశీలించి పోయిన్రు. సాయంత్రం ఓ ట్రేడర్ వచ్చి క్వింటాల్​కు రూ.6,100 ఇస్తమని చెప్పిండు. గింజ మంచిగున్న కూడా రేట్ గింతే అని ఫిక్స్ చేసిండు. తెచ్చిన పంటను తీసుకెళ్లలేక ఆయన చెప్పిన రేటుకే పంట అమ్మేసిన.
–కుర్వ మల్లయ్య, రైతు, గాధిర్యాల్, పాలమూరు జిల్లా

మక్కలకు మంచి రేటు వచ్చింది 

5 ఎకరాల్లో మక్కలు సాగు చేసిన. వరిపంటతో పోల్చితే మక్కల సాగులో కొంచెం కష్టమెక్కువైంది. ఐదు ఎకరాలలో దాదాపు 150 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. చొప్పదండి మార్కెట్ కు పంటను తీసుకెళ్లిన. గవర్నమెంట్ రేట్ రూ.1,850 ఉంటే ఇక్కడి ప్రైవేట్ ట్రేడర్స్ రూ.2,200  పెట్టి కొన్నరు. ఇది నాకు కలిసి వచ్చింది. ఒకవేళ రేటు తగ్గిస్తే లాస్ అయ్యేటోడిని. 
-పిట్టల శంకరయ్య, చొప్పదండి, కరీంనగర్ జిల్లా