
హైదరాబాద్, వెలుగు: ఎర్రమంజిల్ కూల్చి అక్కడే కొత్త అసెంబ్లీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దీనిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్ కూల్చొద్దని, అది వారసత్వ భవనం జాబితాలో ఉందని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. కొత్త అసెంబ్లీకి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని కూడా రద్దు చేసింది.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడంతో ఫుల్ బెంచ్ కు వెళ్లినా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందువల్ల దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఏ విషయాలతో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే దానిపై న్యాయ నిపుణులతో సీఎం సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చని వారితో చర్చించినట్టు తెలిసింది.