
బీసీసీఐ రాజ్యాంగంలోని మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. బీసీసీఐ ఆఫిస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీం అంగీకరించింది. దీంతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా మరో మూడేళ్లు తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
12 ఏళ్లపాటు పదవీకాలం..
బీసీసీఐ రాజ్యాంగంలోని కూలింగ్ పీరియడ్ రూల్‌తో పాటు 70 ఏళ్ల వయో పరిమితిని కూడా తొలగించేలా రాజ్యంగ సవరణ చేసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టులో బోర్డు పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. బీసీసీఐ తరఫున కేంద్ర మాజీ మంత్రి.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా బీసీసీఐ చేసిన ప్రతిపాదన ఆమోదయోగ్యమైందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ సవరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అసోసియేషన్ లో ఆరేళ్లు..బీసీసీఐలో మరో ఆరేళ్లు..సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు..నిరంతర కాలం పదవిలో ఉండొచ్చని తీర్పు వెలువరించింది.
నో కామెంట్..
సుప్రీంకోర్టు తీర్పుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో లెజెండ్స్ లీగ్ చూస్తున్న గంగూలీ..సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించదలచుకోలేదన్నాడు. బీసీసీఐకి సంబంధించిన విషయమని..అది కోర్టు పరిధిలో ఉందని చెప్పుకొచ్చారు. బీసీసీఐ ప్రతిపాదనను మంచిగా భావించి..ఆర్డర్ ఇచ్చారని..దానిపై తాను వ్యాఖ్యానించనని గంగూలీ చెప్పాడు.
బీసీసీఐ రాజ్యాంగంలో ఏముంది..?
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏ ఆఫీస్ బేరరైనా వరుసగా రెండు సార్లు పోటీ చేయవచ్చు. రాష్ట్ర సంఘంలో అయినా..బీసీసీఐలో అయినా..వరుసగా రెండు దఫాలు పదవుల్లో ఉండొచ్చు. ఆ తర్వాత విరామం తప్పకతీసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ పోటీ చేయొచ్చు. అయితే ఈ నిబంధనను ఎత్తేయాలని బీసీసీఐ సుప్రీంకోర్టును కోరింది. తాజాగా సుప్రీంకోర్టు బీసీసీఐ రాజ్యంగ సవరణకు అనుమతించడంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.