మహిళలకు అబార్షన్ చేయించుకునే హక్కుంది

మహిళలకు అబార్షన్  చేయించుకునే  హక్కుంది

అబార్షన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  పరస్పర అంగీకారంతో 24 వారాల గర్భాన్ని మహిళలు తొలగించుకోవచ్చని పేర్కొంది. పెళ్లికాకుండా గర్భం దాల్చే విషయంపై సుప్రీం విచారణ చేపట్టింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ పరిధిలో పెళ్లి కాని మహిళలను కూడా చేర్చవచ్చని తెలిపింది. 

అబార్షన్ కోసం కోర్టుకెక్కిన  మహిళ

మణిపూర్ కు చెందిన 25 ఏళ్ల యువతి 24 వారాల గర్భవతి. సహజీవనం చేసిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో.... ఆమె అబార్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ కోర్టుకు వెళ్లింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2021లో సవరించిన MTP చట్టంలోని నిబంధనలతో సెక్షన్ 3కి వివరణలో భర్త అనే పదానికి బదులుగా భాగస్వామి అనే పదం ఉందని గుర్తుచేసింది. ఇది పెళ్లి కాని వారికి కూడా వర్తించేలా.. చట్టసవరణకు పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపిందని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వైవాహిక అత్యాచారం కూడా రేపే..
వైవాహిక అత్యాచారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బలవంతంగా కలిస్తే..అది కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అది  బలవంతపు గర్భధారణ కిందకు వస్తుందని తెలిపింది. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. MTP చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని తెలిపింది.