
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ 2016 (రెరా) అమలు కోసం రాష్ట్రాలు తెచ్చిన రూల్స్ వల్ల కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం రూపొందించిన చట్టం పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రాష్ట్రాల రూల్స్‌ను కేంద్రం పరిశీలిస్తుందని, చట్టం మరింత మెరుగ్గా అమలవుతుందని ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (ఎఫ్‌పీసీఈ) పేర్కొంది. మీరు చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాల రూల్స్ ఉన్నాయా లేదా ? అనేది తేల్చాలని జడ్జీలు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌తో కూడిన బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువు ఇస్తూ, ఈ ఏడాది మేలోపు రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. రెరా చట్టం ఐదేళ్ల నుంచి అమలవుతున్నా ఆశించిన ప్రయోజనాలను కలిగించడం లేదని ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్ అభయ్ కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు. రెరాను అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా అమలు చేయడం లేదని, సేల్ అగ్రిమెంట్‌కు సంబంధించిన రకరకాల రూల్స్ ఉన్నాయని అన్నారు. కొంతమంది బిల్డర్లు రెరాను ఖాతరు చేయకపోవడంతో హోమ్ బయర్లకు మేలు జరగడం లేదని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు తప్పకుండా మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు అభయ్ వివరించారు. రెరా అమలులో వైఫల్యాలు, లోపాల గురించి త్వరలోనే సుప్రీంకోర్టుకు తెలుస్తుందని, బయర్లకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఇక నుంచి బిల్డర్లకు, బయర్లకు మధ్య జరిగే ఒప్పందం సక్రమంగా అమలయ్యే అవకాశాలు ఉంటాయని, పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేమెంట్ షెడ్యూల్, డెలివరీ షెడ్యూల్, నిర్మాణ లోపాల బాధ్యత వంటి విషయాల్లో రూల్స్ సక్రమంగా అమలు కావడం లేదని కొలియర్స్ ఇండియా సీఈఓ రమేశ్ నాయర్ అన్నారు.