ఆ నాలుగు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ లో పెట్టిన సుప్రీంకోర్టు

ఆ నాలుగు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ లో పెట్టిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 24 గంటలు కూడా పూర్తవక ముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని ప్రశ్నించింది. 

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల  (ఈసీ)నియామకాలకు కొలీజియం వంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు సమయం ఇచ్చింది. ఈసీ, సీఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా..? వద్దా..? అన్న దానిపై త్వరలో తీర్పు ఇవ్వనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

24గంటల్లో అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవి మే15వ తేదీన ముగిస్తే.. ఆ ఖాళీని భర్తీ చేయడానికి నవంబర్ 18వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అటార్నీ జనరల్ ను న్యాయస్థానం  ప్రశ్నించింది. 24 గంటలు గడవకుండానే ఒకేరోజు నియామక ప్రక్రియ ప్రారంభం కావడం, అదే రోజు క్లియరెన్స్, దరఖాస్తు, నియామకం ఎలా జరుగుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.