ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్య సమాజ్ పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ : లవ్ మ్యారేజ్ అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆర్య సమాజ్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోని సందర్భంలో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకోవడం కామన్. పెళ్లి అనంతరం  ఆర్యసమాజ్ ఇచ్చే సర్టిఫికెట్లు చట్టపరంగా చెల్లుబాటు అయ్యేవి. అయితే ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే వివాహాలపై సుప్రీంకోర్టు శుక్రవారం (జూన్ 3న) సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. అక్కడ జరిగే పెళ్లిళ్లకు ఇచ్చే స‌ర్టిఫికెట్లను అధికారిక పత్రంగా గుర్తించ‌మ‌ని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఆర్య స‌మాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయ‌డానికి కాద‌న్న సుప్రీంకోర్టు.. యువ‌త పెద్దల అంగీకారం లేక‌పోవ‌డంతో నేరుగా ఆర్య స‌మాజ్‌ను ఆశ్రయిస్తున్నారని అభిప్రాయ పడింది. అలా వచ్చిన యువ జంట‌ల‌కు ఆర్య స‌మాజ్ పెళ్లిళ్లు చేస్తోందని, ఇలా జ‌రిగిన వివాహాల కారణంగా ఆయా కుటుంబ పెద్దలు క‌క్షలు పెంచుకోవ‌డం, ప‌రువు హ‌త్యలు క్రమంగా పెరిగిపోతున్న వైనంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఆర్య స‌మాజ్ జారీ చేసిన వివాహ స‌ర్టిఫికెట్లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగి, జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. వివాహ స‌ర్టిఫికెట్ల‌ను జారీ చేయ‌డం ఆ సంస్థ ప‌నికాద‌ని తేల్చి చెప్పింది. 

మైన‌ర్ అయిన తన కూతురిని, ఓ యువ‌కుడు కిడ్నాప్ చేసి బ‌ల‌వంతంగా ఆర్య‌స‌మాజ్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడంటూ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఆర్య‌స‌మాజ్ ఇచ్చిన స‌ర్టిఫికెట్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టులో చూపి అమ్మాయి మేజ‌ర్ అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశార‌ని పిటిష‌న‌ర్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో మైన‌ర్ బాలిక‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడిపై కేసు న‌మోదైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వివాహ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అధికారులు జారీ చేస్తార‌ని పేర్కొంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

మరిన్ని వార్తల కోసం..

బర్త్ డే వేడుకల కోసం వెళ్లి...

మైనర్ బాలిక కేసులో సంచలన వాస్తవాలు..!